గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

రంపచోడవరం: గంజాయి ముఠాను రంపచోడవరం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్‌డీపీఓ అష్రిఫ్‌ అలీ తెలిపారు. ఈ మేరకు రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణాపై సమాచారం రావడంతో సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, ఎస్సై రమేష్‌లు రంప గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. నాలుగు బైక్‌లపై 11 మంది వ్యక్తులు వస్తూ, తనిఖీలను గమనించి బైక్‌లు వెనక్కి తిప్పి పారిపోతుండగా పోలీసులు వెంబడించి రెండు బైక్‌లపై ఉన్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. మిగిలిన రెండు బైక్‌పై నలుగురు తప్పించుకున్నారు. పట్టుబడిన వ్యక్తుల వద్ద నుంచి 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను విచారించగా, వారంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు గ్రామం పరిధిలో అనేక బైక్‌లు, ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు తేలింది. వారి నుంచి ఆరు బైక్‌లు, 33 గ్రాముల బంగారం, 1.85 గ్రాములకు పైగా వెండి, కెమెరా తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సామర్లకోటకు చెందిన కొరిమిల్లి సురేష్‌, పి.వెంకట సత్యవరప్రసాద్‌, రొంగల సూర్యకిరణ్‌, షేక్‌ యాసిన్‌, సాయి, ఆర్‌.అఖిల్‌, ప్రసాద్‌, శివరామదుర్గారెడ్డి, రంప గ్రామానికి చెందిన బాబ్లు, పెద్దబారంగికి చెందిన లిల్లీ, కుంజా సిద్ధులను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement