రత్నగిరికి భక్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి భక్తుల వెల్లువ

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

అన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్‌ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు.

రెండో ఘాట్‌ రోడ్డు సిద్ధం

తుని రూరల్‌: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం రెండో ఘాట్‌ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాలుగా లోవ దేవస్థానానికి మొదటి ఘాట్‌ రోడ్డు మీదుగానే భక్తులు, వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా వాహనాలు, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆషాఢ మాసం, ఇతర పర్వదినాల్లో ఘాట్‌ రోడ్డులో తరచుగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించాలన్న ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తిపై డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ సంస్థ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు రూ.70 లక్షలు అందించడంతో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించారు. దీనిని అధికారికంగా ప్రారంభించాల్సి ఉండగా.. ట్రయల్‌ రన్‌గా కొండపై నుంచి దిగువకు వెళ్లే వాహనాలను ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు.

కొమరిపాలెం పంచాయతీకి

ఐఎస్‌వో గుర్తింపు

అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపుగా ఇచ్చే ఐఎస్‌వో సర్టిఫికెట్‌కు ఎంపికయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో కొమరిపాలెం గ్రామం మొదటగా ఈ పురస్కారానికి ఎంపికై నట్టు పంచాయతీ ప్రత్యేకాధికారి వి.నాగేంద్రప్రసాద్‌ బుధవారం తెలిపారు. కేరళకు చెందిన ప్రత్యేక ఆడిట్‌ బృందం సోమ, మంగళవారాలలో గ్రామంలో పర్యటించింది. ఆడిట్‌ బృంద సభ్యులు కేఎం సలీమ్‌ ఆధ్వర్యంలో విజయవాడ పీఆర్‌ కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది కళ్యాణి తదితరులు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, పంచాయతీ కార్యాలయ ఫైళ్ల నిర్వహణ, కార్యాలయ పనితీరు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. గ్రామస్తుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించిన బృంద సభ్యులు పంచాయతీ పనితీరు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించి ఐఎస్‌వో సర్టిఫికెట్‌కు ఎంపిక చేసినట్టు ప్రత్యేకాధికారి తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన స్థానిక నాయకులతో పాటు పంచాయతీ కార్యదర్శి ఎం చిన్ని, డి రాము, లచ్చిరెడ్డి అపర్ణ, వీఆర్వో శివకుమార్‌, సచివాలయ సిబ్బందిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement