అమలాపురం రూరల్: పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా మునిసిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏపీ ఈపీడీసీఎల్, మున్సిపల్ కమిషనర్, ఎల్డిఎంతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి పీఎం సూర్య ఘర్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమలాపురం నడిపూడి సమ్మర్ స్టోరేజ్ చెరువు వద్ద నున్న రెండు ఎకరాల విస్తీర్ణంలో 500 కిలో వాట్ యూనిట్ ఏర్పాటుపై పై చర్చించారు. ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ బి రాజేశ్వరి, మునిసిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, ఇంజినీర్లు, నెడ్‌క్యాప్ ప్రతినిధులు ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
చెత్తను వేరు చేయాలి
చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులకు సూచించారు. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ శానిటైజేషన్ వెబినార్ కలెక్టర్లతో బుధవారం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ చెత్త సేకరణ మూడు రకాలుగా చేపట్టాలన్నారు తడి, పొడి చెత్త, హాని కర వ్యర్థాలు విడివిడిగా సేకరించాలన్నారు.
పనివేళలను మార్చాలి
పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా, కార్మికుల ఆరోగ్య, ప్రాణ రక్షణ కోసం పనివేళలను మార్పు చేయాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పనులను తగ్గించాలన్నారు. ప్రతి పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
పాడి పరిశ్రమపై సమీక్ష
పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, సొసైటీలు పాటుపడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో పశుసంవర్ధక శాఖ సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశు దాణా విక్రయాలు, పాల దిగుబడి పెరుగుదల అంశాలపై సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా, రైతుల సేవే పరమావధిగా సొసైటీల ద్వారా ఈ మల్టీ–గ్రేడ్ దాణాను విక్రయిస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ అనిత, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ, రోళ్లపాలెం సొసైటీ అధ్యక్షుడు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్‌రావు, వివిధ డైరీ ఫామ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.


