వరి రైతుకు కాస్త ఊరట | - | Sakshi
Sakshi News home page

వరి రైతుకు కాస్త ఊరట

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

సాక్షి, అమలాపురం: ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.72 కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌ రూ.2,369 ఉండగా, పెంచిన ధరతో ఇది రూ.2,441 కు పెరిగింది. గ్రేడ్‌ – ఏ ధాన్యం ధర రూ.2,489 ఉండగా పెంచిన ధరతో రూ.2,461కు చేరింది. ఈ ధరలు వచ్చే ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు నుంచి అమలులోకి రానున్నాయి.

కోనసీమ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో వరి సాగు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 1,31,500 ఎకరాలలో వరి సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. ఖరీఫ్‌ రబీ సీజన్లకు సంబంధించి సుమారు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటించినట్టు చెబుతోంది. వాస్తవంగా రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో వరి పెట్టుబడి అధికంగా ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో వ్యవసాయ రుణాల కోసం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ టెక్నికల్‌ కమిటీ నిర్ధారించిన పెట్టుబడి ఖరీఫ్‌లో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేలు. ఖరీఫ్‌ సగటు దిగుబడి 29 బస్తాలు అంటే (21.75 క్వింటాళ్లు). అంటే క్వింటాల్‌ ఉత్పత్తికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,528. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తానన్నది రూ.2,441. అంటే ఖరీఫ్‌ సాగు చేస్తే రైతులకు మిగిలేది ఏమీలేదనే. కేంద్రం చెబుతున్న పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలంటే క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.3,792 ప్రకటించాలని కోనసీమ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మద్దతు ధర క్వింటాల్‌కు రూ.72 పెంపు

Advertisement
 
Advertisement
Advertisement