సమంజసం కాదు
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యేటా ఎరువుల ధరలను పెంచడం సరికాదు. దీనివల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి ధాన్యంబస్తాపై అదనపు ధర సౌకర్యం కల్పించాలి
– గుణ్ణం రాంబాబు, వరి రైతు, మాజీ సర్పంచ్,
గుమ్మిలేరు, ఆలమూరు మండలం
పాత నిల్వలను ప్రదర్శించాలి
ఎరువుల ధరలు పెరుగుతాయన్న వార్తల దృష్ట్యా ఇప్పటి వరకూ ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలి. దీనివల్ల అవసరమైన రైతులు ఎరువులను కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ విధానాన్ని జిల్లా వ్యవసాయశాఖ సమగ్రంగా అమలు చేయాలి.
– ముదునూరి సత్యనారాయణరాజు,
రైతు, ఆత్రేయపురం
ఆలమూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను భారీగా పెంచేసింది. వాటి ధరలు పెంచుతున్నంత వేగంగా ధాన్యం ధర పెంచాలని కనీసం ఆలోచించకపోవడం శోచనీయం. ఆరుగాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక అన్నదాత నానా అవస్థలు పడుతున్నాడు. ధాన్యం మసూళ్లు సమయంలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నా.. చంద్రబాబు సర్కార్ పంటల బీమా తొలగించి తీరని అన్యాయం చేస్తున్నా కనీసం ప్రశ్నించేవారు లేకపోవడం బాధాకరం. అర్హులైన అనేక మంది రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ యోజన అందజేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 400 టన్నుల ఎరువుల నిల్వల్లో సగానికి పైగా విక్రయించినట్టు వ్యవసాయశాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. విక్రయించినట్టు చూపించిన ఎరువులను రాబోయే ఖరీఫ్ సీజన్‌లో కొత్త ధరలతో విక్రయించి వ్యాపారులు దోచుకుంటారనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ సైతం అంతగా స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఖరీఫ్ సీజన్‌కు ముందే ధరల పెంపు
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1.32 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టేందుకు సుమారు 88.74 వేల మంది రైతులు సన్నద్ధమవుతున్నారు. మూడేళ్లుగా వరికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోయినా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ఎరువుల ధరలు పెరిగాయి. ప్రస్తుత ఏడాదైతే రూ.75 నుంచి రూ.300 వరకూ ధర పెరిగింది. ఈ ఖరీఫ్ సీజన్‌కు యేటా మాదిరిగానే సుమారు 43.25 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా వరి రైతులపై సుమారు రూ.11.80 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం డీఏపీ, యూరియాకు భారీగా అందిస్తున్న రాయితీని ఈ ఖరీఫ్ సీజన్‌లో ఉపసంహరించుకునే పరిస్థితి ఉందనే సమాచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
పాత నిల్వల పరిస్థితి ఏంటి?
జిల్లాలో గత రబీ సీజన్‌లో సరఫరా చేసిన ఎరువుల్లో అత్యధిక భాగం ప్రైవేటు డీలర్లు, సొసైటీల వద్ద నిల్వ ఉండిపోయాయి. అయితే ఆ ఎరువులను పాత ధరలకు విక్రయించాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకునేలా వ్యవహరించడం లేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 166 సొసైటీలతో పాటు ప్రైవేట్ ఎరువు, పురుగు మందుల దుకాణాల వద్ద సుమారు 15 టన్నుల వరకూ ఎరువుల నిల్వలు ఉన్నట్లు వ్యవసాయ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాబోయే సీజన్‌లో రైతుల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని పాత ధరల ఎరువులను కొత్త ధరలకు విక్రయిస్తారేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత ఎరువుల నిల్వలు, ధరల పట్టికను ఆయా సొసైటీల వద్ద, ఎరువులు దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుకు భారంగా ఎరువు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చడీ చప్పుడు కాకుండా ఒకేసారి ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారాయి. రబీ సీజన్ ముగిసిన వెంటనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఈ ఎరువుల ధరలను ఉద్దేశపూర్వకంగా పెంచి అధికభారం మోపాయనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డీఏపీ, యూరియా ధరల్లో మార్పులు ఉండవని చెబుతున్నా, నియంత్రణలో లేని మిగిలిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు బారీ స్థాయిలో పెరిగాయి. ఈ కాంప్లెక్స్ ఎరువుల పెరుగుల వల్ల అన్నదాతకు ఎకరాకు రూ.రెండు వేల వరకూ పెరిగిపోతుంది.
మరోసారి పెరిగిన కాంప్లెక్స్
ఎరువుల ధరలు
బస్తాకు రూ.75 నుంచి
రూ.300కు చేరిక
అన్నదాతలపై రూ.11.80 కోట్ల భారం
పాత ఎరువులను కొత్తవాటితో కలిపి
విక్రయించేలా వ్యాపారుల చర్యలు
పట్టించుకోని జిల్లా వ్యవసాయ శాఖ


