సాక్షి, అమలాపురం: గడచిన రెండేళ్లుగా జిల్లాలో ముందస్తు ఖరీఫ్‌కు అడ్డంకులు తప్పడం లేదు. ఈ ఏడాదైనా కుదురుతుందా అనుకుంటే వంతెనల నిర్మాణం పేరుతో మరోసారి ముందుస్తు సాగుకు బ్రేకులు పడనున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్‌ను గట్టెక్కించడం.. రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం.. మూడో పంటగా అపరాలు సాగు చేయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్‌లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో ఖరీఫ్. తొలి ఖరీఫ్ సమయానికి కూటమి అధికారంలోకి వచ్చినా కొలువుదీరలేదు. రెండోసారి అంటే గత ఏడాది కూడా జూన్ 1న నీరు వదిలి మమ అనిపించారు. తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 100 క్యూసెక్కులు వదిలారు. ఆత్రేయపురం మండలం లొల్ల సమీపంలో 15 రోజుల పాటు నీరు నిలిపివేశారు. అమలాపురం ఈదరపల్లి వద్ద, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణం పేరుతో అటు చల్లపల్లి, ఇటు అల్లవరం బెండా కాలువకు నెలాఖరు వరకు నీరు వదల్లేదు. సకాలంలో నీరు విడుదల చేయకపోవడంతో అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు.
ఇప్పుడు ఆలస్యమే
ఆర్‌అండ్‌బీ అధికారుల తీరు వల్ల ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని మూడు వంతెనల నిర్మాణానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ మూడు వంతెనలు బెండాకెనాల్ (నడిపూడి నుంచి అల్లవరం కాలువ) మీదనే. ఈదరపల్లి పాత వంతెనను ఆధునీకరించడంతో పాటు ఇందుపల్లి, అమలాపురం అయ్యప్పస్వామి ఆలయం వద్ద వంతెన పనులు మొదలు పెట్టారు. ఇక్కడ ఎంత వేగంగా పనులు చేసినా నెల రోజుల సమయం పడుతోంది. అంటే జూన్ 15 తరువాత కాని ఈ కాలువ నుంచి దిగువకు నీరు వదిలే అవకాశం లేదు. ఇందుపల్లి వియర్ దిగువన (అమలాపురం, అల్లవరం మండలాలో) సుమారు 14,600 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉంది. ఆక్వా సాగు పోగా సుమారు 8 వేల ఎకరాలలో వరి సాగవుతోందని అంచనా. ఈ చేలకు సకాలంలో నీరందదు. వంతెనల నిర్మాణాలు ఆలస్యమైతే ఇక్కడ సాగు కూడా ఆలస్యంగా మొదలు పెట్టాలి. ఆ పరిస్థితి వస్తే ఈసారి కూడా రైతులు తొలి పంటను వదిలేసుకోవలసిందే.
ముందస్తు సాగుకు అడ్డంగా
వంతెన నిర్మాణాలు
ఈనెల 15 లేదా జూన్ ఒకటి నుంచి
నీరు విడుదల
అమలాపురం బెండా కాలువపై పనులు
అమలాపురం, అల్లవరం మండలాల్లో
ఆలస్యం కానున్న సాగు
సాగుకు దూరమవుతున్న రైతులు
అధికారులదే తప్పంతా
మధ్య డెల్టాలో పంట కాలువలను గత నెల 27వ తేదీ కల్లా మూసివేస్తారని తెలుసు. పైగా ఈ ఏడాది మే 15 కల్లా సాగునీరు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని జల వనరుల శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక వేళ మే 15కు అనుమతి రాకున్నా జూన్ 1న అయినా కాలువలు తెరవాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు కాలువలకు నీరు వదిలే ముందు తాపీగా పనులు ప్రారంభిస్తుండడం గమనార్హం. ఇందుకు అధికారులు చెప్పే కారణం వంతెనల నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఆలస్యమైందని. వంతెన నిర్మాణం మంచిదే అయినా ఆ కారణంగా వేలాది ఎకరాల ఆయకట్టు సకాలంలో సాగునీరు అందించకుండా చేయడాన్ని రైతులు తప్పుపడుతున్నారు.


