అర్జీలు ఫుల్‌.. పరిష్కారం సోసో | - | Sakshi
Sakshi News home page

అర్జీలు ఫుల్‌.. పరిష్కారం సోసో

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

పీజీఆర్‌ఎస్‌పై అర్జీదారుల అసంతృప్తి

క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు

అమలాపురం రూరల్‌: సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించడమే తప్ప పరిష్కారాలు చూపడం లేదని ప్రజలు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల, పట్టణ కేంద్రాల్లో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇస్తున్నా అదే తంతు నడుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో అర్జీదారులు పోటెత్తారు. జేసీ వైఖోమ్‌ నిడియాదేవి తదితర అధికారులు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 165 అర్జీలు స్వీకరించారు.

పింఛన్‌ ఇప్పించండి

25 ఏళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాను. 2004 వరకు ప్రభుత్వ పింఛను వచ్చేది. నాపై హత్య కేసు నమోదు కావడంతో పింఛను నిలిపివేశారు. ఆ కేసును 2012లో కోర్టు కొట్టేసింది. 2014 నుంచి పింఛను కోసం తిరుగుతున్నా మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని చెప్పారు. పింఛను ఇప్పించి ఆదుకోవాలి.

– ఆచంట కృష్ణమూర్తి, బి.సావరం, రాజోలు

ఉపాధి పనులు నిలిపివేయాలి

వరికోతలు, ఊడ్పులు సమయంలో 60 రోజుల పాటు ఉపాధి పనులు నిలిపివేయాలి. ఎండిన ధాన్యాన్ని, గడ్డిని ఒబ్బిడి చేసుకునేందుకు కూలీలు దొరకడం లేదు. ఆ కాలంలో ఉపాధి పనులకు విరామం ప్రకటించాలని జీవో ఇచ్చినా అమలు కావడం లేదు. భారత్‌ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌, జేసీ, డ్వామా పీడీలకు వినతి పత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు.

– ఉప్పుగంటి భాస్కరరావు, బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం

నా స్థలం ఆక్రమించి ప్రహరీ కట్టారు

నేను ఒంటరి మహిళను. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తు న్నా. ఓదూరులో నాకు పెంకుటిల్లు ఉంది. ఈశాన్యంలో పది అడుగులు వదలి ఇల్లు నిర్మించాను. జీవనోపాధి నిమిత్తం ఏడేళ్లు గ్రామంలో లేను. ఇటీవల ఇంటికి వచ్చి చూడగా ఇంటి పక్కన ఉన్న కడిం శ్రీను, కడిం నాగలక్ష్మి నా స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ కట్టారు. అదేమని ప్రశ్నిస్తే నాపైనే దౌర్జన్యం చేసి రాకపోకలను అడ్డుకునేలా రాళ్లు, కంకర వేస్తున్నారు. నిన్ను చంపినా అడిగే దిక్కు లేదంటూ బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించాను. – కలవల సత్యవతి, ఓదూరు, రామచంద్రపురం

డ్రెయిన్‌తో ఇబ్బందులు

అమలాపురం పట్టణం 12వ వార్డులో డ్రెయిన్‌లో పూడికలు తీయకపోడం వల్ల నీరు పొంగి దోమలు వ్యాపిస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదు. వైద్యనాథం వీధిలో ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం వల్ల వాసన వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రాంతంలో హోల్‌సేల్‌ వ్యాపారుల వల్ల వాహనాల రద్దీ అధికంగా ఉండి ట్రాఫిక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాం.

– షేక్‌ ఖాజాబాబు, మాజీ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అమలాపురం పట్టణం

Advertisement
 
Advertisement
Advertisement