పోలీస్‌ గ్రీవెన్స్‌కు 28 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 28 అర్జీలు

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

అమలాపురం టౌన్‌: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 28 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి గ్రీవెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆయా పోలీస్‌ స్టేషన్లకు ఫోన్లు చేసి సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటంబ తగదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలే ఉండడంతో వారికి ఎస్పీ, ఏఎస్పీలు కౌన్సిలింగ్‌ చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నించారు.

గోదావరిలో యువకుని గల్లంతు

యానాం: తన స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన యువకుడు గోదావరిలో గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన ఇంటర్మీడియెట్‌ చదువుతున్న 18 ఏళ్ల సాహెద్‌ అబ్దుల్‌ పైజాన్‌ తన స్నేహితులు 11 మందితో కలిసి నాలుగు బైక్‌లలో యానాంకు వచ్చారు. పట్టణాన్ని సందర్శించి అనంతరం గౌతమీగోదావరిలో శివంబాత్‌ వద్ద గోదావరిలో స్నానానికి దిగారు. షేక్‌ పైజాన్‌ గల్లంతుకావడంతో ఆందోళన చెందిన మిగిలివారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అతని తల్లిదండ్రులు, బంధువర్గం ముమ్మిడివరం కొత్తలంక బాబా దర్శనానికి వెళ్లారని, తాను రానని చెప్పి వారికి చెప్పకుండా యానాం వచ్చాడని స్నేహితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అన్ని డ్రైన్లు బాగు చేస్తాం

మలికిపురం: రైతుల పాలిట దుఃఖదాయనిగా మారిన శంకరగుప్తం మేజరు డ్రైన్‌ ఆధునికీకరణతో పాటు దాని అనుబంధ మీడియం, మైనర్‌ డ్రైన్లను సైతం మరమ్మతు చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అన్నారు. శంకరగుప్తం మేజరు డ్రైన్‌ పూడికత తీత పనులను సోమవారం కేశనపల్లిలో ప్రారంభించారు. గత ఏడాదిగా డ్రైన్‌ దుస్థితిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవడంతో డ్రైన్‌ పూడిక తీత పనులకు ప్రభుత్వం రూ.20.77 కోట్లు విడుదల చేసింది. ‘ముంచెట్టుతోంది’ శీర్షికతో సోమవారం సాక్షిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. దశల వారీగా అనుబంధ డ్రైన్లు బాగు చేస్తామని, నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని ఆయన వేదికపై ప్రకటించారు. రాజోలు దీవిలో 60 గ్రామాల్లోనూ ఉప్పునీటి బారిన పడి రైతులు నష్ట పోతున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ధవళేశ్వరం ప్రాజెక్టు చైర్మన్‌ గుబ్బల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కేశనపల్లిలో పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్‌, డ్రైన్స్‌ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement