ముంచెట్టుతోంది | - | Sakshi
Sakshi News home page

ముంచెట్టుతోంది

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

ఉప్పునీటితో దెబ్బతింటున్న కొబ్బరి తోటలు

లెక్కలు వేసినా పరిహారం

మాటెత్తని ప్రభుత్వం

ఆందోళన చెందుతున్న రైతులు

మలికిపురం: కల్పతరువు.. కొబ్బరి చెట్టు. కోనసీమకు వన్నె తెచ్చే పంట ఇది. ప్రస్తుతం రాజోలు దీవిలో కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సుమారు ఐదు వేల ఎకరాలకు పైబడి కొబ్బరి చెట్లు ఉప్పునీటి బారిన పడి చనిపోయాయి. మరో 20 వేల ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు, వరి చేలు ప్రమాదంలో పడ్డాయి. ఇటీవల విశాఖ కేంద్రంగా జరిగిన లైడార్‌ సర్వేలో పలు కీలక అంశాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇక్కడి భూమి కుంగడం, ఉప్పునీటి బారిన పడి ఇలా జరుగుతుందని ఆ సర్వేలో పేర్కొన్నారు. మారుతున్న భౌగోళిక పరిస్థితులతో పాటు ఓఎన్జీసీ వంటి ఆయిల్‌ సంస్థల అన్వేషణ, చమురు వెలికితీత వంటి కారణలతో ఇలా జరుగుతుందని పలువురు చెబుతున్నారు. రాజోలు దీవిలో ప్రధానంగా 26 కిలోమీటర్ల పొడవున ఉన్న శంకరగుప్తం క్రీక్‌ (రక్త తుల్యనది) పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో ఈ ప్రభావం అఽధికంగా ఉంది. సముద్ర పోటు ప్రభావంతో ఉప్పునీరు ఈ క్రీక్‌ (డ్రైన్‌)లోకి వస్తుంది. మామిడికుదురు మండలం కరవాక నుంచి ప్రవేశించే ఈ డ్రైన్‌ గోగన్నమఠం, కాట్రేనిపాడు, గొల్లపాలెం, తూర్పుపాలెం, పల్లిపాలెం, గూడపల్లి, గుబ్బలపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, శంకరగుప్తం, బట్టేలంక, కత్తిమండ, అడవిపాలెం, చింతలమోరి మోరిపోడు, మోరి, కేశవదాసుపాలెం గ్రామాల మీదుగా కేశవదాసుపాలెంలో సముద్రం వద్ద ముగుస్తుంది. రాజోలు దీవిలోని అన్ని ప్రధాన మీడియం, మైనర్‌ డ్రైన్లు కలిసి మురుగునీటిని కరవాక, గోగన్నమఠం గ్రామాల వద్ద వైనతేయ నదిలో కలుపుతోంది. దీవిలో దాదాపు అన్ని గ్రామాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఈ డ్రైన్‌ పరిధిలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఉప్పునీటి ప్రభావం నానాటికీ అధికం కావడంతో కొబ్బరి చెట్లు చనిపోవడం అధికమైంది. కొబ్బరి తోటలపైనే ఆధారపడిన అనేక మంది రైతులు, నిరు పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు.

నాలుగేళ్లుగా అధ్యయనం చేసి..

ఈ సమస్యలపై కేంద్రం నుంచి వచ్చిన బృందం నాలుగేళ్లుగా నాలుగు సార్లు ఆయా గ్రామాల్లో పర్యటించింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కేరళ నుంచి వచ్చిన కొబ్బరి అభివృద్ధి బోర్డు సభ్యులు, డ్రైన్స్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ అధ్యయనం చేశారు. ఉప్పునీటి ప్రభావం వల్లే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని గుర్తించారు. దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా వారు పరిశీలన చేశారు.

ఇక్కడితో సమస్య ఆగదు

కేవలం రూ.20 కోట్లతో కరవాక నుంచి శంకరగుప్తం వరకూ పూడికతీసి గట్టు వేసినంత మాత్రాన సమస్య తీరిపోదు. ఎందుకంటే ఈ డ్రైన్‌ పరిధిలోని గ్రామాల్లో సమస్య జఠిలంగానే ఉంది. ఇటీవల ఉద్యాన శాఖ చేసిన సర్వేలో కేవలం మేజర్‌ డ్రైన్‌ పరిధిలో బాధిత రైతులనే గుర్తించారు. ఇంకా అనేక గ్రామాల్లో ఇలా కొబ్బరి చెట్లు చనిపోయి రైతులు ఆదాయం కోల్పోయారు. ఇటీవల ఉద్యాన, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో చేసిన సర్వేలో చాలా తక్కువగా నష్టం అంచనా వేశారు. శంకరగుప్తం మేజర్‌ డ్రైన్‌ పరిధిలో మాత్రమే 1,501 మంది రైతులు 513 హెక్టార్లలో తోటలను నష్టపోయారని, వారికి రూ.58.09 కోట్ల పరిహారం ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాస్తవంగా కొబ్బరి, సరుగుడు తోటలకు నష్టం చాలా ఎక్కువగా ఉంది. శంకరగుప్తం మేజర్‌ డ్రైన్‌తో పాటు గోగన్నమఠం, కూనవరం, కత్తిమండ, వేపచెట్టు, గొంది, రామేశ్వరం తదితర మీడియం, రెవెన్యూ డ్రైన్ల ద్వారా కూడా ఉప్పునీటి ప్రభావానికి విలువైన భూములు, పంటలను రైతులు కోల్పోతున్నారు. వీటి లెక్క వేయడం లేదు.

కేశనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (ఫైల్‌)

అన్ని గ్రామాల్లోనూ సమస్యే

ఉప్పునీటి ప్రభావంతో రాజోలు దీవిలో దాదాపు అన్ని గ్రామాల్లోని కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. కొబ్బరి చెట్లపైనే ఆధారపడి జీవించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు పరిహారం అందించాలి. శంకరగుప్తం డ్రైన్‌తో పాటు అన్ని డ్రైన్లపై దృష్టి పెట్టాలి. మొక్కుబడిగా నిధులు కేటాయింపు కాదు.

– రుద్రరాజు చిన్నరాజా, గుడిమూల, సఖినేటిపల్లి మండలం

ప్రభుత్వానికి పంపాం

ఉప్పునీటి ప్రభావంతో శంకరగుప్తం మేజరు డ్రైన్‌ పరిధిలో చనిపోయిన కొబ్బరి చెట్ల లెక్కలు వేశాం. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపాం. పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు బాధితులకు అందిస్తాం.

– రమణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement