● హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్
● అమలాపురంలో కోర్టుల ప్రారంభం
అమలాపురం టౌన్: న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు లేకపోతే కక్షిదారులకు త్వరితగతిన న్యాయ సేవలు అందించలేమని తూర్పుగోదావరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ అన్నారు. అమలాపురం కోర్టు భవనాల్లో కొత్తగా ఏర్పాటైన 14వ అదనపు జిల్లా కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను దేవానంద్‌తో పాటు మరో నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అధ్యక్షతన జరిగిన సభకు హైకోర్టు న్యాయమూర్తులు దేవానంద్, ఆర్.రఘునందన్‌రావు, బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా అదనపు కోర్టు భవనానికి 2012లో శంకుస్థాపన జరిగితే, 2026లో ప్రారంభోత్సవం జరిగిందంటే కోర్టుల పట్ల, మౌలిక సదుపాయాల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ఘటన ప్రత్యేక సాక్ష్యమని గుర్తు చేశారు. రాష్ట్రంలో 96 కోర్టులు మంజూరయ్యాయని, వీటికి పూర్తి మౌలిక సదుపాయాల కల్పన త్వరలోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. హైకోర్టు న్యాయమూర్తులు రఘునందన్‌రావు, సుమతి, చక్రవర్తి, విజయ్‌లు తూర్పుగోదావరి జిల్లా ముద్దు బిడ్డలని కొనియాడారు. న్యాయమూర్తులు రఘునందన్‌రావు, సుమతి, చక్రవర్తి, విజయ్‌లు మాట్లాడుతూ కేసులు త్వరితగతిన పరిష్కారానికి కొత్త కోర్టులు రావాలన్నారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముమ్మిడివరం న్యాయమూర్తి రహమ్ తుల్లా హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ పుట్టు పూర్వోత్తరాలను సభకు వివరించారు. అనంతరం కోర్టుల భవన సముదాయంలో 14వ అదనపు జిల్లా కోర్టును, 2వ సివిల్ (జూనియర్ డివిజన్) కోర్టు కం మెజిస్ట్రేట్ కోర్టులను ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లా అదనపు కోర్టు బెంచ్‌పై హైకోర్టు న్యాయమూర్తి సుమతి ఆశీనులై కొన్ని కేసులను పరిశీలించారు. 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గంటా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గుబ్బల చంద్రమౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, సీనియర్ న్యాయవాదులు ఎండీ ఆజామ్, నల్లా ప్రభాకర్, కుడుపూడి అశోక్, డీబీ లోక్, నల్లా సురేష్‌కుమార్, కళా వెంకట్రావు, కూచిమంచి శశిధర్ శ్రీరామ్, అబ్బిరెడ్డి సురేష్ తదితరులు హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నిదియాదేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, అమలాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.


