ఎస్.అన్నవరం వద్ద కమ్ముకున్న కారు మబ్బులు
అనపర్తి: ఈవీఎంల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యథావిధిగా మాటల గారడీ చేస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. అనపర్తి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, తన అవినీతిని నిరూపిస్తే ఆస్తులు రాసిస్తానంటూ ఎమ్మెల్యే చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలని అన్నారు. ఆయన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామన్నారు. అక్రమ సంపాదనతో కూడిన ఆ పాపిష్టి సొమ్ము తమకు చిల్లిగవ్వ కూడా అవసరం లేదని అన్నారు. గతంలో ఎమ్మెల్యేకి ఎవరెవరు ఎంతెంత లంచాలు ఇచ్చారో బాధితులే నేరుగా వెల్లడించారని, అవసరమైతే వారు ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక మద్యం షాపు యజమాని విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, డబ్బులివ్వకముందు టీ ఇచ్చి పంపిన ఎమ్మెల్యే, ముడుపులు అందిన తర్వాత తన ఇంట్లో చేపల పులుసు బాగుంటుందని భోజనం పెట్టారని, ఇది ఆయన తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటి పక్కనే దాదాపు ఏడాదిన్నర పాటు భారీ పేకాట డెన్ నడిచిందని, రోజుకు రూ.2 లక్షల చొప్పున భారీగా వసూళ్లు జరిగాయని, పరిస్థితి శ్రుతి మించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ డెన్‌పై రైడ్ చేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. అతని ఇంట్లో జరిగిన రెండు శుభకార్యాల సందర్భంగా వ్యాపారవేత్తలను బెదిరించి వందకు పైగా బంగారు బిస్కెట్లు వసూలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ కార్యక్రమాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఎటువంటి కటింగ్స్ లేకుండా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.


