యథావిధిగా నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

యథావిధిగా నేడు పీజీఆర్‌ఎస్‌

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

అమలాపురం రూరల్‌: పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలను సోమవారం యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవనంలో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు నేరుగా కాల్‌ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు.

విఘ్ననాయకా భజేహం

అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్‌) ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పంచామృతాభిషేకంలో ఒక జంట, లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో ఎనిమిది మంది పాల్గొని పూజలు చేశారు. ఆరుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, ముగ్గురికి తులాభారం, నలుగురికి అన్నప్రశన చేశారు. ఏడుగురు తలనీలాలు సమర్పించగా, 15 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1,673 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్క రోజే ఆలయానికి రూ.2,14,525 ఆదాయం సమకూరిందని ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement