అరకొర పనులూ క్లోజ్‌ర్‌! | - | Sakshi
Sakshi News home page

అరకొర పనులూ క్లోజ్‌ర్‌!

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

నియోజకవర్గానికి రూ.మూడు

కోట్లతో పనులని హడావుడి

జిల్లాలో చేస్తామని చెప్పిన పనుల

విలువ రూ.18 కోట్లు

పంట కాలువల అత్యవసర

మరమ్మతులకు రూ.12 కోట్లు

చేస్తున్నవి మాత్రం అంతంతమాత్రం

క్లోజర్‌ పనులపై ఆసక్తి చూపని

చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ ఏటా నీట మునుగుతున్నా.. రబీకి శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడుతున్నా అందుకు ప్రధాన కారణం డెల్టా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే. మూడంచెల పంట కాలువలు, నాలుగంచెల మురుగునీటి కాలువల వ్యవస్థ పూడుకుపోయి, పలుచోట్ల కుంగిపోయి ఆక్రమణల బారిన పడటం వల్ల ఏటా రైతులు కోట్లాది రూపాయల పంటను నష్టపోతున్నారు. ఈ విపత్తుల నుంచి రక్షించేందుకు పంట కాలువలు, మురుగునీటి కాలువలను ఆధునీకరించాలని రైతులు కోరుతున్నారు. వరుసగా రెండో ఏడాది క్లోజర్‌ (పంట కాలువలు మూసివేసిన సమయంలో) పనులను చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా చేసి మమ అనిపిస్తుండడంతో ఈ ఏడాది కూడా నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడో వంతు పనులు కూడా అనుమానమే

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గోదావరి డెల్టా ఆధునీకరణ, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటినెన్స్‌ (ఓ అండ్‌ ఎం), క్లోజర్‌ పనులు వంటి వాటికి రూ.75 కోట్లు కేటాయించింది. డెల్టాకు కేటాయించింది అరకొర నిధులే అయినా వాటిని కూడా పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు. దీనిపై రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో డెల్టా పరిధిలో నియోజకవర్గానికి రూ.మూడు కోట్లతో పనులు చేస్తామని చెప్పింది. రూ.రెండు కోట్లతో పంట కాలువలకు అత్యవసర మరమ్మతులు, పూడికతీత పనులు, రూ.కోటితో ఏడాది పొడవునా మురుగునీటి కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలగిస్తామని హామీ ఇచ్చింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు కలిపి రూ.18 కోట్ల పనులు చేయాల్సి ఉంది. మూడవ వంతు కూడా పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

కాలువల్లో ఇంకని నీరు

జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలోని ప్రధాన పంట కాలువలు, చానల్స్‌, పంట బోదెలలో ఇప్పటికీ నీరు ఇంకా లేదు. చూస్తుంటే కాలువలు ప్రవహిస్తున్నట్టుగానే ఉన్నాయి. కాలువలలో ఈ స్థాయిలో నీరు ఉంటే అరకొర పనులు చేయడం కూడా వీలుకాదు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 15 నాటికి పంట కాలువలు మూసివేస్తామని, తిరిగి జూన్‌ ఒకటో తేదీని తెరుస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 45 రోజుల క్లోజర్‌ సమయంలో పనులు పెద్ద ఎత్తున చేస్తామన్నారు. తీరా రబీ పూర్తి కాకపోవడంతో తూర్పు డెల్టా కాలువకు ఏప్రిల్‌ 25 వరకు, మధ్య డెల్టా కాలువకు ఏప్రిల్‌ 28 వరకు నీరు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా క్లోజర్‌కు కేవలం 33 నుంచి 36 రోజుల సమయం మాత్రమే దక్కినట్టు అయింది.

ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ల్లో పారుతున్న నీరు

ఈ ఏడాదీ ఇబ్బందులు తప్పవా?

ధవళేశ్వరం, బొబ్బర్లంక హెడ్‌ స్లూయిజ్‌ల నుంచి శివారు లాకుల వరకు అన్నీ అధ్వానంగా ఉండడంతో నీరు లీకవుతోంది. ఈ నెల మూడో తేదీన కురిసిన భారీ వర్షంతో పంట కాలువలు, చానల్స్‌, పంట బోదెల్లో నీరు చేరింది. దీంతో పూడికతీసే పనులు చేపట్టే అవకాశం కన్పించడం లేదు. కనీసం ఉపాధి హామీ పథకంలో చిన్న చిన్న పంట బోదెలు కూడా తవ్వే అవకాశం లేదని రైతులు అంటున్నారు. క్లోజర్‌ పనులు పెద్దగా జరగకపోవడంతో ఈ ఏడాది కూడా ఖరీఫ్‌లో ముంపు నీరు దిగకపోవడం, రబీలో శివారు, మెరకలకు నీరు అందకపోవడం వంటి ఇబ్బందులు పడక తప్పదని డెల్టా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement