రామచంద్రపురం: ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని రబీలో పండిన ధాన్యాన్ని కొనే నాథుడు లేడని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త పిల్లి సూర్యప్రకాశ్ విమర్శించారు. రబీలో పండిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద గురువారం సూర్యప్రకాశ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ వాతావరణం అనుకూలించటంతో జిల్లాలో ధాన్యం అధిక దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. జిల్లాలో 16 రైసు మిల్లులే ఉన్నాయని వీటికి మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసే అనుమతి ప్రభుత్వం ఇవ్వటంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. సుమారు రూ.420 కోట్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండగా కేవలం 16 రైస్ మిల్లులు ఉండటంతో ఇది సాధ్యం కాదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాతిపదికగా తీసుకుని రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రబీ మాసూళ్లు జరుగుతుండగా ఎప్పుడు వర్షం వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సీఎంఆర్‌ను నిలిపివేసిందన్నారు. ఇదే అదనుగా దళారులు అయినకాడికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.1,770 మద్దతు ధర ప్రకటించినా రూ.1,640లకే కొనుగోలు చేస్తూ రైతులను వెన్నపోటు పొడుస్తున్నారని అన్నారు. పంటను పూర్తి స్ధాయిలో కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. అనంతరం రైతులు, పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
గిట్టుబాటు ధర ఏది బాబూ?
అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ రామచంద్రపురం
కో ఆర్డినేటర్ సూర్యప్రకాశ్
రైతులకు అండగా ధర్నా
ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాతిపదికగా ధాన్యం సేకరించాలని డిమాండ్
రైతులను నట్టేట ముంచేసిన చంద్రబాబు
గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన చంద్రబాబు రైతులను మాఫీ చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాఽథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పంటలు పండించిన రైతులు తీవ్ర సంక్షోభంలో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకి అని అన్నారు. జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడు గుణ్ణం సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ ఎంపీపీలు, పార్టీ కన్వీనర్‌లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


