ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది

May 9 2026 9:49 AM | Updated on May 9 2026 9:49 AM

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు బాబి

అమలాపురం టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600లకు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దుతు ధర ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబి గుర్తు చేశారు. కేజీ పొగాకు ధర రూ.265 కూడా పలకడంలేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందని గుర్తు చేశారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్ట నష్టాలు వర్ణనాతీతమన్నారు. కొందరు నేతలు బ్లాక్‌ మార్కెట్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్‌ కొరత వరకూ కొందరు కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ పంటకు మద్దతుఽ ధర దక్కకపోతే ఆ పంటకు మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్‌ సమయంలో కూడా గ్రామాలకు వాహనాలను పంపించి ఆయా పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించిన ఘటనలను గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తూ ధరల స్థిరీకరణ వాగ్దానాన్ని విస్మరించిందన్నారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళనలకు దిగుతామని బాబి హెచ్చరించారు.

పుష్కరాల పనులపై సమీక్ష

అమలాపురం రూరల్‌: గోదావరి పుష్కరాలు 2027ను పురస్కరించుకొని తరలివచ్చే భక్తుల రక్షణ, భద్రత ధ్యేయంగా అభివృద్ధి పనులకు అంచనాలను ప్రతిపాదించాలని జాయింట్‌ కలెక్టర్‌ వైఖడ్‌ నిడియాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నదీ తీర ప్రాంతాల్లోని ఘాట్లను ఆధునీకరించడమే ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలిపారు. పాత ఘాట్లకు మరమ్మతులు చేపట్టడం, రక్షణ గోడల నిర్మాణం, నదీ తీరంలో మెట్ల నిర్మాణం చేపట్టేలా ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలు రూపొందించాలన్నారు. డీఆర్‌ఓ వీ.సుబ్బారావు దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్‌ వీ. సత్యనారాయణ, పీఆర్‌ ఎస్‌ ఈ పీ.రామకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూ ఎస్‌ ఎస్‌ ఈ ఏవీఎస్‌ రాజన్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ బీ. రాము, సీసీఓ ఎం మురళీకృష్ణ జల వనరుల శాఖ ఈ ఈ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

డిజిటల్‌ జనగణన పూర్తి చేయాలి

జిల్లాలో మే 1 వ తేదీ నుంచి ప్రారంభమైన డిజిటల్‌ జనగణన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వైఖోడ్‌ నిడియాదేవి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ మే 30 నాటికి వంద శాతం పూర్తి కావాలన్నారు.

పురుగు మందు తాగిన

యువకుల మృతి

ఆత్రేయపురం : వెలిచేరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేర్వేరు ఘటనలలో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెలిచేరుకు చెందిన సంగ దుర్గాప్రసాద్‌(26) తల్లిదండ్రులు మందలించగా మనస్థాపంతో పురుగు మందు తాగి మృతి చెందాడు. దుర్గాప్రసాద్‌ ఏ పనికీ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గత నెల 30న తల్లిదండ్రులు మందలించడంతో పురుగు మందు తాగాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్‌ రాము తెలిపారు. అదే గ్రామానికి చెందిన అయినం రామాంజనేయులు పురుగు మందు తాగి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఐటీఐ చదివిన రామాంజనేయులుకు ఇటీవల ఉద్యోగం రాగా తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో గత నెల 28న పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్‌ఐ రాము తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement