ధాన్యపు సీమలో దండుపాళ్యం | - | Sakshi
Sakshi News home page

ధాన్యపు సీమలో దండుపాళ్యం

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

సాక్షి, అమలాపురం: ఆరుగాలం కష్టపడి పంట పండించినా ధాన్యానికి గిట్టుబాటు రాక నష్టపోవడం జిల్లా రైతులకు పరిపాటిగా మారింది. ఈ ఏడాది విత్తు నుంచి విక్రయం వరకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రకృతి సహకరించ లేదు. సాగుకు ప్రభుత్వ మద్దతు లేదు.. రైతుకు రుణం దక్కలేదు.. శివారుకు సాగునీరు అందలేదు.. పండించిన ధాన్యానికి ‘కనీస మద్దతు’ ధర అందడం లేదు. దళారులు.. షావుకార్లు కుమ్మకై ్క తాలు, తప్పలు బూచిగా చూపించి బస్తాకు మూడు కిలోల కోత పెడుతుండడంతో పంట పండించినా లాభాలు పొందలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

అసలే ఆలస్యం.. ఆపై కొర్రీలు..

కోతల సమయంలో డీజిల్‌ దొరకక ఒక వారం రోజులు.. ఆకాల వర్షంతో కోతలు నిలిచి మరో వారం రోజులు రబీకి అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ అధిగమించి పండిన ధాన్యాన్ని విక్రయానికి పెడితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలైన ఆర్‌బీకేలు నిబంధనలు వల్లె వేస్తున్నాయి. వర్షాలకు ధాన్యం తడిసినా తేమ శాతం, తాలు తప్పలు, మట్టి వంటి నిబంధనలలో ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. కళ్లాల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీనితో రైతులే ఆయా కేంద్రాలకు వెళ్లి ధాన్యం విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 1.31 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగవగా, సుమారు 4.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని అంచనా. దీనిలో 2.7 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇంత వరకు కేవలం 1.22 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. అంటే లక్ష్యంలో ఇంకా 50 శాతం కూడా కొనుగోలు చేయలేదు. రైతుల అవసరాలకు పోను మిల్లర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇదే అదనుగా దళారులు, ఏజెంట్లు సిండికేటుగా మారారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. వరి ధాన్యం కనీస మద్దతు ధర 75 కేజీల బస్తా రూ.1776.75 చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్‌బీకేలలో నిబంధనలు, ఆర్‌బీకేల వద్దకు వెళ్లి ధాన్యం విక్రయిస్తే రవాణా, జట్టు కూలీల ఇబ్బందులు ఇవ్వన్నీ చూసి రైతులు తమ కళ్లాల వద్దే ధాన్యం విక్రయాలకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వారికి కనీస మద్దతు ధర రావడం లేదు. జిల్లాలో అత్యధికంగా బస్తా రూ.1,700కు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో అయితే కొన్ని చోట్ల తేమ ఎక్కువ ఉన్న పచ్చి ధాన్యాన్ని రూ.1,650 చొప్పున కొన్నారు. తరువాత సన్నాలు, మిగిలిన రకాలకు ఇతర రాష్ట్రాలలో డిమాండ్‌ ఉండడంతో ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు.

మూడు కేజీల కోత

ధర విషయంలో తొలుత అయినట్టుగా తరువాత గిట్టుబాటు కాకపోవడంతో మిల్లర్లు, దళారులు కొత్త పద్ధతి మొదలు పెట్టారు. ధాన్యంలో తాలు తప్పలు వస్తున్నాయని బస్తాకు మూడు కేజీల చొప్పున కోత పెడుతున్నారు. 75 కేజీల బస్తాను కొనుగోలు చేసి 72 కేజీలకు మాత్రమే సొమ్ములు చెల్లిస్తున్నారు. ధాన్యంలో తాలు తప్పలు కేవలం అర కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటోంది. ఇలా ఉన్నా కనీస మద్దతు ధర చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినప్పటికీ మూడు కిలోల చొప్పున నిర్మొహమాటంగా కోత పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు బస్తాకు రూ.71 వరకు నష్టపోతున్నారు. ఎకరాకు 50 బస్తాలు పండిస్తే రూ.3,550 కోల్పోతున్నారు. ఇటీవల భారీ వర్షం పడిన తరువాత తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టి ఇస్తున్నా ధరలకు కోత పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

కేజీలు తగ్గిస్తే చర్యలు తీసుకుంటాం

ధాన్యం కొనుగోలులో నిబంధనలకు విరుద్ధంగా తాలు తప్పలు, ఇతర కారణాలు చూపించి కిలోలు తక్కువ నమోదు చేస్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. 75 కేజీల బస్తాకు మూడు కేజీల తగ్గించి ధర నిర్ణయిస్తే రైతులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

– శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ

తాలు, తప్ప, తేమ పేరుతో

బస్తాకు మూడు కిలోల చొప్పున కోత

నిబంధనలు, రవాణా, జట్టుభారంతో

అయినకాడికి విక్రయిస్తున్న అన్నదాత

ఆర్బీకేల ద్వారా 50 శాతం దాటని కొనుగోళ్లు

ఎంఎస్‌పీ రాకపోవడంపై రైతుల ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement