ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన దొడ్డ పూర్ణచంద్రరావు, భాగ్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.1,00,226 విరాళాన్ని సమర్పించారు. వీరికి ఆలయ సిబ్బంది నారాయణ, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి
జిల్లా పీఆర్‌టీయూ డిమాండ్
అమలాపురం టౌన్: గత ఏడాది ఇచ్చిన బ్యాగుల్లో కొన్ని నాణ్యత లేక నెల రోజుల్లోపే చిరిగిపోయి విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, ఈ ఏడాది నుంచైనా నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలని జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దీపాటి సురేష్‌బాబు, మొంగం అమృతరావు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పీఆర్‌టీయూ శాఖ తమ రాష్ట్ర సంఘం నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంతో చర్చించాలని సూచించిందని, ఈ మేరకు వారు అమలాపురంలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి శనివారం విద్యార్థులు స్పోర్ట్స్ టీ షర్టుల వంటివి ధరించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు ఒక స్పెల్ మాత్రమే పంపిణీ అవుతున్నాయని, ఉపాధ్యాయులకు కూడా స్కూలు కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలా పలు ముఖ్యమైన అంశాలు, సమస్యలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నాటికి పరిష్కరించాలని విద్యా శాఖకు, ప్రభుత్వానికి ఆ నాయకులు విజ్ఞప్తి చేశారు.
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షలు
జేసీ నిడియాదేవి
అమలాపురం రూరల్: జిల్లాలో మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ వైఖోడ్ నిడియాదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో ఆమె సమీక్షించారు. ఇంటర్ రెండేళ్లకు సంబంధించి 14,171 మంది హాజరుకానున్నారని, వీరి కోసం మొత్తం 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రశ్నపత్రాలను జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్లలో భద్రపరచనున్నట్టు తెలిపారు. రోజూ ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో పోలీసు, విద్యుత్, రవాణా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
చదువు ప్రాథమిక హక్కు
చదువు ప్రతి బిడ్డకు ప్రాథమిక హక్కని, పిల్లలను పనులకు పంపడం నేరమని జేసీ నిడియాదేవి పేర్కొన్నారు. అందరి సమన్వయంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. గ్రామస్థాయి బృందాలుగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పడి సమన్వయంతో పనిచేసి బడిబయట పిల్లలను గుర్తించాలన్నారు.
రత్నగిరిపై పెళ్లి సందడి
అన్నవరం: సత్యదేవుని సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాళ్లు, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు.


