● అందుబాటులోకి అదనపు సివిల్ జడ్జి కోర్టు
● జిల్లా న్యాయమూర్తిగా ప్రియదర్శిని నియామకం
● రేపు ప్రారంభోత్సవం ● ఐదుగురు హైకోర్టు జడ్జిల రాక
అమలాపురం టౌన్: అమలాపురానికి 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంజూరైంది. జిల్లా అదనపు కోర్టుతో పాటు రెండో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కూడా మంజూరు కావడంతో మొత్తం కోర్టుల సంఖ్య 8కి చేరుకుంది. ఈ కొత్త జిల్లా కోర్టును, రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటికే 14వ అదనపు జిల్లా కోర్టు జడ్జిగా గంటా ప్రియదర్శిని నియమితులయ్యారు. తాజా కోర్టుల ప్రారంభోత్సవాలకు హైకోర్టు జడ్జి, తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బట్టు దేవానంద్, హైకోర్టు జడ్జీలు ఆర్.రఘుందన్‌రావు, బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, సుమతి జగడం, న్యాపతి విజయ్ ముఖ్య అతిథులుగా హాజరై వాటిని ప్రారంభించనున్నారు. అమలాపురం జిల్లా కేంద్రం అయ్యాక ఇక్కడ కోర్టుల విస్తరణ అనివార్యమైంది. తాజాగా వచ్చిన కోర్టులతో కేసులు మరింత త్వరగా పరిష్కారమయ్యే వీలుంటుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గంధం సునీతతో పాటు న్యాయమూర్తులు గంటా ప్రియదర్శిని, గుబ్బల చంద్ర మౌళీశ్వరి, అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు కోర్టుల ప్రారంభోత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు.


