చిన వెంకన్నకు రూ.2.20 కోట్ల రాబడి | - | Sakshi
Sakshi News home page

చిన వెంకన్నకు రూ.2.20 కోట్ల రాబడి

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, ఏలూరు జిల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ. 2,000, రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. సగటున రోజుకి శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.

11న అప్రెంటిస్‌ మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని వివిధ కంపెనీలకు సంబంధించి ఈ నెల 11న ప్రధాన మంత్రి అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ వేణుగోపాలవర్మ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణులై, ఎన్‌టీసీ సర్టిఫికెట్‌ కలిగిన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని సూచించారు.

హుండీల ఆదాయం

రూ.19.31 లక్షలు

ఆలమూరు: మండలంలోని చింతలూరులో వేంచేసియున్న శ్రీనూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల లెక్కింపు బుధవారం జరిగింది. రామచంద్రపురం దేవదాయశాఖ తనిఖీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ బాలాజీ రామ్‌ప్రసాద్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ వీరి అప్పారావు, కార్యనిర్వాహణాధికారి వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో స్థానిక ఆలయ ముఖ మండపంలో దేవదాయశాఖ సిబ్బంది, మహిళా భక్త బృంద భక్తులు ఈ హుండీలను లెక్కించారు. గత నెల 4 నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ (32 రోజులు) రూ.19.31 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వీర్రాజు తెలిపారు.

రత్నగిరికి

పోటెత్తిన భక్తులు

అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధువులు, రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామి దర్శనానికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.

9న స్విమ్మింగ్‌

క్రీడాకారుల ఎంపికలు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): ఈ నెల 9న స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్విమ్మింగ్‌ సంఘం కార్యదర్శి ఐ.రాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎంపికై నవారు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో జరిగే అంతర్‌ జిల్లాల స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్‌ఏ మైదానం స్విమ్మింగ్‌ పూల్‌లో జరిగే ఎంపికలకు పురుషులు, మహిళలు హాజరు కావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement