● అల్లూరి పోరాట నిరతి ఎనలేనిది
● ఆంగ్లేయ వలస పాలకులపై అగ్గిపిడుగు
● నేడు మన్నెం వీరుడు అల్లూరి వర్ధంతి
అడ్డతీగల: భారత స్వాతంత్య్ర పోరాటంలో సాయుధ విప్లవంతో ఆంగ్లేయులకు దడ పుట్టించిన అల్లూరి శ్రీరామరాజు పోరాట నిరతి ఎనలేనిది. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఓసారి ఆ చైతన్య స్ఫూర్తి చరిత్ర పుటల్లోకి వెళ్లొద్దాం. శ్రీరామరాజుకు అడ్డతీగల ప్రాంతంతో విడదీయరాని బంధం ఉంది. 1897 జులై 4న విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగిలో ఆయన జన్మించారు. 1922వ సంవత్సరంలో మొదలు పెట్టిన సాయుధ విప్లవం 1924 మే 7న ఆయన ప్రాణాలు విడిచే వరకూ ఆయన తిరుగుబాట్లు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని రగిల్చాయి. వాటిలో రంప తిరుగుబాటు చెప్పుకోదగినది. మద్రాసు అటవీ చట్టం (1882) ద్వారా గిరిజన హక్కులను బ్రిటీష్ సామ్రాజ్యవాదులు కాలరాస్తున్న వేళ సామాజిక అసమానతలను చూసి అల్లూరి రగిలిపోయారు. దీంతో గిరిజనులతో కలసి సాయుధ పోరాటం ద్వారా తెల్ల దొరలకు నిద్ర లేకుండా చేశారు.
గెరిల్లా యుద్ధ తంత్రం
బ్రిటీష్ వారి ఆధునిక ఆయుధాలను ఎదుర్కోవడానికి అల్లూరి గెరిల్లా పద్ధతిని (అడవుల్లో దాక్కొని మెరుపు దాడి చేయడం) ఎంచుకున్నారు. ఇలా పోలీస్‌స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. ముందుగా లేఖలు రాసి మరీ దాడులు చేస్తూ బ్రిటీష్ వారికి సవాలు విసిరారు. 1922 అక్టోబర్ 15న అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఆయుధాలను, అక్కడ నిర్బంధించిన కొందరు గిరిజన విప్లవకారులను విడిపించుకుని వెళ్లిపోయారు. అనంతర కాలంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, చింతపల్లి, అన్నవరం, కేడీ పేట పోలీస్‌స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకువెళ్లారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవడం బ్రిటీష్ పాలనను అంతం చేయడం లక్ష్యంగా ఆయన ఉద్యమం చేశారు. ఎన్నో విఫలయత్నాలు చేసి చివరకు 1924 మే 7న చింతపల్లి అడవుల్లో అల్లూరిని పట్టుకుని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం వద్ద కాల్చి చంపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి చరిత్ర పుటల్లో చిరస్మరణీయమైన పోరాటానికి చిరునామాగా నిలిచారు.
అడ్డతీగలతో ఆత్మీయ బంధం
కొంత కాలంపాటు అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద నివసించి, గిరిజనులతో మమేకమై పలు విషయాలపై వారిలో చైతన్యం తీసుకువచ్చారు. రచ్చబండ వద్ద గిరిజనులతో సమావేశమై వారి తగవులను తీర్చేవారు. ఆయుర్వేద వైద్య సేవలను కూడా అందించేవారు.


