విఘ్నేశ్వరునికి సంకటహర చతుర్థి పూజలు | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరునికి సంకటహర చతుర్థి పూజలు

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారికి సోమవారం సంకటహర చతుర్థి పూజలు వైభవంగా జరిపారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి పంచమృతాభిషేకాలు, లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాలు, గరిక పూజ, ఉండ్రాళ్ల పూజ, శ్రీ లక్ష్మీ గణపతిహోమం నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాదం 2,276 మంది భక్తులు స్వీకరించారు. స్వామికి వివిధ పూజల ద్వారా రూ.3,24,759 ఆదాయం లభించినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

విద్యా శాఖలో విభజన షురూ

రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియకు విద్యా శాఖ తెర తీసింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన జరిగింది. దీంతో, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఉమ్మడి తూర్పు గోదావరి విభజన జరిగింది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 11 ఏజెన్సీ మండలాలను కలిపి ఇటీవల పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు. పునర్విభజన అనంతరం కొత్త జిల్లాల్లో విద్యా శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసి, పరిపాలన సాగిస్తున్నారు. అయితే, జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ బదిలీలు, పదోన్నతులు మాత్రం ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన మాత్రమే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటుతో పాటుగా ఇతర అంశాలను కొత్త జిల్లాల ప్రాతిపదికన చేపట్టేందుకు పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల విభజన, సర్దుబాటు ప్రక్రియకు తెర తీసింది.

గెజిట్‌లో నోటిఫై కావడంతో..

కొత్త జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేయడంతో ఇకపై అన్ని ప్రక్రియలూ కొత్త జిల్లాల వారీగానే జరగనున్నాయి. ఇటీవల నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు మాత్రం కేంద్రం ఇంకా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన తొలుత ఉద్యోగుల సర్దుబాటుపై దృష్టి సారించినట్లు సమాచారం. జిల్లాల వారీగా ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఆ సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు, ప్రస్తుతం పని చేస్తున్న వారు, ఖాళీలు, మిగులు పోస్టులు, విద్యా శాఖ కార్యాలయాల్లో సిబ్బందిని పరిగణలోకి తీసుకుని పోస్టుల సర్దుబాటు చేస్తారు. ఈ క్రమంలో స్థానికత, సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేస్తే జూన్‌, జూలైల్లో కొత్త జిల్లాల ప్రాతిపదికన విద్యా శాఖ పాలన ప్రారంభమయ్యే అవకాశంఉంది.

ఏమవుతుందో!

గతంలో తెలంగాణ రాష్ట్రంలో పునర్విభజన జరిగిన జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు వివాదాస్పదంగా, గందరగోళంగా మారింది. ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడి ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది. తమ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలనే డిమాండ్‌ ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది.

ఆర్‌డీఓ శ్రీరమణి సస్పెన్షన్‌ రద్దు

సామర్లకోట: పెద్దాపురం ఆర్‌డీఓ కె.శ్రీరమణి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో ఫిబ్రవరి 28న 28 మంది మరణానికి కారణమైన బాణసంచా విస్ఫోటంలో డివిజన్‌ స్థాయి అధికారులను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా నాడు పెద్దాపురం ఆర్‌డీఓగా ఉన్న శ్రీరమణి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. సామర్లకోట మండలం ఏర్పడినప్పటి నుంచీ కాకినాడ డివిజన్‌లోనే ఉంది. ఆర్‌డీఓ సస్పెండ్‌ అవడానికి నెల రోజుల ముందే ఈ మండలాన్ని పెద్దాపురం డివిజన్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో ఆర్‌డీఓకు సంబంధం లేదంటూ ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. ఈ నేపథ్యంలో శ్రీరమణి సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement