అమలాపురం టౌన్: తమకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని కోరుతూ అమలాపురంలో దళిత క్రైస్తవులు మంగళవారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులపై దాడులను తక్షణమే అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా క్రైస్తవ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను నిరాకరిస్తున్న 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నల్లవంతెన వద్ద నుంచి మొదలైన ర్యాలీ ఎర్రవంతెన, ముమ్మిడివరం గేటు సెంటరు, గడియారం స్తంభం సెంటరు, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం రోడ్డు మీదుగా సాగింది. ర్యాలీలో క్రైస్తవులు పలుచోట్ల మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేసి తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. గడియారం స్తంభం సెంటరులో నాయకులు సభ నిర్వహించి ప్రసంగించారు. కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడులకు వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. జేఏసీ నాయకులు ఎ.రాజ్‌కుమార్, ఎం.యెహోషువ, ఎర్నెస్ట్ తాతపూడి, శ్రావణ్‌కుమార్, సువర్ణరాజు, దానియేలు, స్పర్జనరాజు, శాంతిరాజుతోపాటు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, కేపీడబ్ల్యూ, ఎఫ్‌ఎఫ్‌సీఐ తదితర క్రైస్తవ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


