అమలాపురం రూరల్: పారదర్శకత, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి రెవెన్యూ అధికారి జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయిలక్ష్మి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులకు జిల్లాలోని భూ సమస్యల పరిష్కారం, రీ–సర్వే ప్రక్రియ వేగవంతం, ప్రజా ఫిర్యాదుల తక్షణ పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 22–ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై విచారణ జరిపి, అర్హత కలిగిన భూములను జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. జేసీ వైఖోమ నిడియాదేవి, ఆర్డీవోలు జి.మమ్మీ, బి.భాగ్యవతి, సర్వే ఏడి కే. ప్రభాకర్ పాల్గొన్నారు.


