● ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని వైద్యం
● చాలాచోట్ల వైద్యుల కొరత
● అంబులెన్స్‌లు లేవు,
ఉన్నచోట డ్రైవర్లు లేరు
సాక్షి, అమలాపురం: సర్కారు వైద్యం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఆలనాపాలనా కరవైంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌సీలు), ఇలా అన్నింటా వసతుల లేమి కనిపిస్తోంది. గైనకాలజీ, కార్డియాలజీ వంటి విభాగాలకు వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో అత్యవస వైద్యం కోసం రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాగే అంబులెన్స్ కొరత పట్టిపీడిస్తోంది. ఉన్నచోట డ్రైవర్లు లేక ఇబ్బంది వస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఆసుపత్రులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, పలు సమస్యలు వెలుగుచూశాయి. ఆ వివరాలు ఇలా..
సమస్యల్లో ‘పడకేసి’
అమలాపురంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ 40 నుంచి 50 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్ పేషెంట్‌లకు బెడ్‌లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రికి ఉన్న ఒకే ఒక అంబులెన్స్ రోగులకు అత్యవసరమైతే సేవలు అందడం లేదు. ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగే మెడికల్, బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లకు ఇది వైద్యులను తరలించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆసుపత్రిలో మందుల కొరత ఉంది. దాదాపు 600 రకాల మందులను అందుబాటులో ఉండాల్సి ఉండగా, క్వార్టర్ చివరిలో ఉండడం వల్ల దాదాపు 70 నుంచి 80 రకాల మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
● రామచంద్రపురం 100 పడకల ఏరియా ఆసుపత్రి మండపేట, అనపర్తి, రామచంద్రపురం నియోజకవర్గాలకు పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ఆర్‌ఎంఓ, చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్ వైద్యులు లేరు. అతి ముఖ్యమైన కార్డియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. దీనితో గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసరమైన వైద్యం అందడం లేదు. ఈ నేపథ్యంలో కాకినాడకు పరుగులు తీయాల్సి వస్తోంది. కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్ ప్రస్తుతం మూలనపడింది.
● కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు అంబులెన్స్ ఉంది. కానీ డ్రైవర్ లేరు. దానితో షెడ్లో నిరుపయోగంగా ఉంది.
● రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించకపోవడంతో గర్భిణులు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గైనకాలజిస్ట్‌ను నియమించకపోతే ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను హెచ్చరించినా, ఫలితం లేదు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడు ఉన్నా వైద్య చికిత్సలకు అవసరమైన సదుపాయాలు అవసరం ఉంది. దీనికోసం రూ.40 లక్షలతో ప్రతిపాదన చేసినా ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహించేందుకు పది బెడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ నిలిచిపోతే జనరేటర్ సదుపాయం లేక డయాలసిస్ జరుగుతున్న సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
● పి.గన్నవరం సీహెచ్‌సీలో డీసీఆర్, పీడియాట్రిషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, మత్తు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎస్సార్ పద్ధతిలో తాత్కాలికంగా డాక్టర్లను నియమించి సేవలందిస్తున్నారు. రెగ్యులర్ డాక్టర్లు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గైనకాలజిస్ట్ పోస్టులకు గాను ఒకరిని ఇతర ప్రాంతానికి డిప్యూటేషన్ వేశారు. దీంతో ఉన్న ఒక డాక్టర్ సెలవు పెడితే ఆ రోజుల్లో డెలివరీలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. డిప్యూటేషన్‌పై వెళ్లిన గైనకాలజిస్ట్‌ను వెనక్కి రప్పించాలని, శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్టోర్ నుంచి రావాల్సిన మందుల స్టాక్ ఆలస్యంగా వస్తుంది.


