చెరువులో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

తాళ్లరేవు: జాతీయ రహదారి 216 చెంతన కోరంగి వంతెన దిగువన గల రొయ్యల చెరువుల్లో పడి వినకోటి సత్తిబాబు(34) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్‌ఐ పి.సత్యన్నారాయణ, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పటవల ఎస్సీపేటకు చెందిన సత్తిబాబు రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. అయితే చెరువు మధ్య భాగంలో చేరే మురుగును తొలగించేందుకు ఏర్పాటు చేసిన యంత్రంలో ప్రమాదవశాత్తూ కాలు చిక్కుకుపోయింది. దీంతో సత్తిబాబు నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన ఇతర కూలీలు హుటాహుటిన అతన్ని బయటకు తీసి తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక సామాజిక ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతోపాటు, చెరువుల యజమాని రఘుతో మాట్లాడారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని చెరువుల యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

వృద్ధురాలికి అపరిచిత వ్యక్తి టోకరా

అమలాపురం టౌన్‌: ఓ వృద్ధురాలికి బ్యాంక్‌ రుణం ఇప్పిస్తానని నమ్మించి, ఓ అపరిచిత వ్యక్తి 24 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. ఈ మేరకు అమలాపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పేరూరు శివారు తోట్లపాలేనికి చెందిన ఆ వృద్ధురాలి ఇంటికి అపరిచిత వ్యక్తి ఈ నెల 2న మోటారు సైకిల్‌పై వచ్చి మాట కలిపి రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె ఇంట్లో బంగారు గొలుసు ఉందని గ్రహించాడు. రుణం కాగితాలు పూర్తి చేసేందుకు ఆమెను పంచాయతీ వద్దకు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మి ఆ వృద్ధురాలు ఆ అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌ ఎక్కింది. పంచాయతీ వద్దకు వెళ్లిన తర్వాత ఆమెను అక్కడే దింపి ఇప్పుడే వస్తానని చెప్పి వృద్ధురాలి ఇంటికి వెళ్లి బంగారు నగను కాజేసి పరారయ్యాడు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు గ్రామంలో సీసీ పుటేజీలు సేకరించారు. దాని ఆధారంగా ఆ ఆగంతకుడిని గుర్తించి పట్టి ఇచ్చిన వారికి రూ. 5 వేలు రివార్డుగా అందిస్తామని క్రైమ్‌ పోలీసులు ప్రకటించారు. వివరాలకు 94404 73215 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు.

జనసేన కార్యకర్తపై

టీడీపీ నేతల దాడి

పి.గన్నవరం: అమ్మవారి జాతర సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తపై టీడీపీ నాయకులు, ఇద్దరు పోలీసులు దాడికి పాల్పడ్డారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాడ్రేవుపల్లిలో మాణిక్యాలమ్మ జాతర సందర్భంగా ఈ ఘటన జరిగింది. జనసేన నాయకుల కథనం ప్రకారం.. ఈ నెల 2న మాణిక్యాలమ్మ జాతర సందర్భంగా వాడ్రేవుపల్లికి చెందిన మానేపల్లి నాగసాయి లక్ష్మీ నరసింహస్వామి అనే జనసేన కార్యకర్త నాయీ బ్రాహ్మణుల తరఫున పవన్‌ కళ్యాణ్‌, ఎమ్మెల్యే సత్యనారాయణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అదే రోజు రాత్రి అతను భార్య, పిల్లలతో కలసి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, పాత కక్షలతో స్థానిక టీడీపీ నాయకులు కోళ్ల సాయితేజ, బొక్కా వెంకట రమణమూర్తి, ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు (వెంకన్న బాబు), చెల్లుబోయిన వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. ఫ్లెక్సీ పెట్టడానికి నీకు ఎంత ధైర్యం అంటూ, కులం పేరుతో దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన అతని భార్యను గెంటేశారు. జాతరలో తన భర్తను టీడీపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కొట్టారని ఆరోపిస్తూ బాధితుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు చేసింది. ఫ్లెక్సీ తీసివేయాలంటూ ఏఎస్సై, కానిస్టేబుల్‌ కలసి తన భర్తను కొట్టారని తెలిపింది. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్సై శివకృష్ణకు ఫిర్యాదు చేసింది. ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, నాయకులు వాసంశెట్టి కుమార్‌, జేఎస్‌ రాజా, అడబాల తాతకాపు, ఎన్‌.రఘు తదితరులు బాధితులకు మద్దతు నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement