రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్
రామచంద్రపురం: రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురం పట్టణ గాంధీపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ రబీ సీజన్‌లో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, సుమారు 30 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించినా, బహిరంగ మార్కెట్‌లో రైతులకు కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్య మాత్రమే ధర లభిస్తోందని అన్నారు. 2026 మార్చి నాటికి సగటు మార్కెట్ ధర క్వింటాలుకు రూ.1,589గా నమోదైందని, కొన్ని ప్రాంతాల్లో ధర రూ.1,429 వరకూ పడిపోయిందని చెప్పారు. ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,200 వరకూ ఉంటున్నప్పటికీ, రైతులు తీవ్ర నష్టాలతో పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, కృష్ణా జిల్లాల్లోని రైతులు మధ్యవర్తుల ఒత్తిడికి లోనై తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను సేకరించారని గుర్తుచేశారు. ఇటీవల ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మొక్కజొన్న సేకరణకు ముందుకు వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బోస్ విమర్శించారు. మొక్కజొన్నను తక్షణమే కనీస మద్దతు ధర రూ.2,400కు ప్రభుత్వం సేకరించాలన్నారు. ప్రతి మండలంలో ప్రభుత్వ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అకాల వర్షాలు, పెనుగాలుల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్, నేతలు పాల్గొన్నారు.


