సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

లో

కళ్లంలో నీళ్లు

సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పరిధిలో రబీ రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తు నుంచి పంట చేతికి వచ్చే వరకూ సాగునీరు.. ఎరువుల కోసం రైతులు పడిన కష్టాలు ఎన్నో. అన్నింటినీ అధిగమించి పంట పండించినా.. కోతల వేళ కష్టాలు తప్పడం లేదు. నిన్నమొన్నటి వరకూ డీజిల్‌ కొరతతో మెషీన్‌ కోతలకు ఇబ్బంది అయ్యింది. ఆదివారం కురిసి భారీ వర్షంతో ఆ పనులు మరింత ఆలస్యం కానున్నాయి.

జిల్లాలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం అన్నదాతల గుండెల్లో గుబులు రేపింది. వర్షానికి ముందు భారీ ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు పడిపోయాయి. దీంతో అమలాపురం–బొబ్బర్లంక, అమలాపురం–కాకినాడ జాతీయ రహదారి 216 వంటి ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొత్తపేట మండలం అవిడి వద్ద చెట్టు కూలిపోవడంతో గంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జేసీబీలు, క్రేన్లతో వాటిని తొలగించారు. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగబడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన వంటి శివారు మండలాలకు సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదు.

అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు వంటి లోతట్టు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరి వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. అమలాపురం పట్టణం ఈదరపల్లి వంతెన దిగువన రెండడుగుల ఎత్తున నీరు చేరింది.

తడిసిన ధాన్యం

రెండు గంటల పాటు కురిసిన వర్షం రబీ రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వర్షానికి కళ్లాలోని ధాన్యం తడిచిపోయింది. వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పుకున్నారు. అయినా వర్షం నీరు దిగువ నుంచి ఆ రాశుల్లోకి చేరింది. ఈదురుగాలులకు బరకాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు.

జిల్లాలో కోతలు ముమ్మరంగా సాగినప్పటికీ ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతోంది. యంత్రాల కోత వల్ల ధాన్యంలో 24 శాతం నుంచి 26 శాతం తేమ వస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో మాత్రం 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొంటున్నారు. దీనివల్ల రైతులు మూడు నాలుగు రోజుల పాటు ధాన్యాన్ని ఎండబెట్ట విక్రయించాల్సి వస్తోంది. దీని వల్ల రైతుల కళ్లాల్లోనే ధాన్యపు నిల్వలు ఉండిపోవడంతో అవి తడిసిపోయాయి. ఈ ధాన్యాన్ని ఆరబెట్టడం వారికి తలకు మించిన భారంగా మారింది. వర్షానికి పనులు కూడా తెలిసిపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 183 ఎకరాలలో చేల మీద పనులు ఉన్నట్టు అంచనా. అయితే వాస్తవంగా ఇంతకన్నా ఎక్కువే పనులు మీద ఉన్నాయని రైతులు చెప్తున్నారు.

మొన్న డీజిల్‌ కొరత.. నేడు వర్షం..

అకాల వర్షం రబీ వరి రైతుల నెత్తిన పిడుగు పాటుగా మారింది. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 1.31 లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఇప్పటి వరకు 64,567 ఎకరాలలో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 66,437 ఎకరాలలో వరి కోతలు జరగాల్సి ఉంది. ముందస్తు సాగు జరిగిన ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్‌లలో 65 శాతం వరకు కోతలు పూర్తి కాగా, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో 40 శాతం కోతలు మాత్రమే జరిగాయి. వారం పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న డీజిల్‌ కొరత వల్ల వరి కోతలు ఆలస్యమైన విషయం తెలిసిందే. దీనివల్ల కోతల జాప్యమయ్యాయి. తాజాగా భారీ వర్షం వల్ల ఐదారు రోజులు పాటు యంత్రాలు పొలాల్లోకి దిగే పరిస్థితి లేదు. దీనికి తోడు పనల మీద ఉన్న చేలు, పడిపోయిన చేల నూర్పిళ్లు కూడా వారం రోజుల పాటు ఆలస్యం కానుంది. సకాలంలో డీజిల్‌ అంది ఉంటే జిల్లాలో ఇప్పటికే 90 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యేవని రైతులు చెబుతున్నారు. రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపించిన అలసత్వం ఇప్పుడు వారి ఇబ్బందులకు కారణమైంది.

ఉద్యాన పంటలకు మేలు

ఇదిలా ఉండగా భారీ వర్షం ఉద్యాన రైతులకు కొంత ఊరటనిచ్చింది. గడిచిన పది రోజులుగా జిల్లాలో 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల వల్ల కొబ్బరి, అరటి, పోక, కోకో, కూరగాయల పంటలు వాడిపోతున్నాయి. బోర్ల ద్వారా నీరందిస్తున్నా ఎండకు తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురవడంతో ఉద్యాన పంటలు కోలుకున్నాయి.

8

కోనసీమ జిల్లాలో భారీ వర్షం

ఈదురు గాలులు.. ఉరుములు..

మెరువులు

రోడ్లపై కూలిన చెట్లు

నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

తడిసి ముద్దయిన ధాన్యపు రాశులు

వారం పాటు నిలిచిపోనున్న కోతలు

డీజిల్‌ కొరతతో మొన్నటి వరకు ఆలస్యం

రబీ రైతులను వీడని కష్టాలు

Advertisement
 
Advertisement
Advertisement