జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: కష్టపడి పండించిన ప్రతి గింజను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. అకాల వర్షాల పట్ల అజాగ్రత్త వహించకుండా అధికారుల సూచనలు పాటించాలని ఆయన అన్నారు. ఆదివారం పౌర సరఫరా అధికారులు, వ్యవసాయ శాఖ, తహసీల్దార్లతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే మూడు రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రతి ధాన్యం సేకరణ కేంద్రంలోనూ సరిపడా టార్పాలిన్లు, బరకాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఉత్కంఠకు నేటితో తెర..
నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
యానాం: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలో 30 వ యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటిగ్ హాలులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్ చేసి, 7.30కు స్ట్రాంగ్‌రూమ్‌లలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో ఉంచనున్నారు. అనంతరం 8 గంటలకు పోస్టల్‌బ్యాలెట్‌లు ఒక టేబుల్ వద్ద, పది టేబుళ్లలో 8.30కు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్‌బూత్‌లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది.
తాటిపర్తిలో కార్డన్ సెర్చ్
38 ద్విచక్ర వాహనాల స్వాధీనం
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఎస్సైలు ఎన్.రామకృష్ణ, వి.మణికుమార్, వంద మంది పోలీసు సిబ్బందితో కలసి తాటిపర్తి గ్రామంలో ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు వివరాలు సేకరించి, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలను గమనించినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు.
‘మట్టి’ దొంగలు దొరికేనా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కడియపులంకలో నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.లక్షల విలువైన నల్లమట్టిని దోచుకుపోయిన దుండగులను అధికారులు పట్టుకుంటారా అనే సందేహాలను మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల దోపిడీయే ప్రధాన అజెండా పని చేస్తున్న కొందరు నాయకులు ఈ మట్టి దోపిడీకి కూడా అండదండలు అందించారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నిత్యం వందలాది మంది తిరిగే రోడ్డు పక్కనే ఉన్న మట్టిని రాత్రికి రాత్రే మాయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనే మట్టి దోపిడీకి సిద్ధమైనప్పటికీ మీడియాలో కథనాలు రావడంతో ఆ మట్టిని పరిరక్షించాల్సిందిగా సంబంధిత నిర్మాణ కాంట్రాక్టర్‌కు రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ముఖ్య నాయకుల మధ్య వాటాలు కుదరనందువల్లనే అప్పట్లో మట్టి జోలికి వెళ్లలేదని కూడా అంటున్నారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా మట్టి దోచుకుపోవడం వెనుక భారీ మంత్రాంగమే నడిచిందని, వాటాలపై అక్రమార్కులు స్పష్టతకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. కూటమి పార్టీల్లోని కీలక నాయకులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.


