అమలాపురం రూరల్: పశు సంవర్ధక శాఖలో 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన డిప్యూటీ డైరెక్టర్ కర్నీడి వెంకట సత్యనారాయణమూర్తి సేవలు అమూల్యమని ఆ శాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ సందర్భంగా స్థానిక సత్యనారాయణ కల్యాణ మండపంలో ఆదివారం ఆ శాఖ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన సభలో పీఆర్ డిప్యూటీ ఈఈ అన్యం రాంబాబు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ మూర్తి తదితరులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మూర్తి దంపతులను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. అనంతరం మూర్తి మాట్లాడుతూ కోనసీమ రైతులు, ఉద్యోగుల సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు రైతులకు సేవలు అందించానన్నారు.
ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు
డీటీఓ శ్రీనివాసరావు
అమలాపురం రూరల్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యా సంస్థల బస్సులు మే 15 కల్లా ఫిట్‌నెస్ పొందాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 71 విద్యాసంస్థలకు 784 బస్సులు ఉన్నాయని, వాటికి విధిగా ఫిట్‌నెస్ పొందాలని డీటీఓ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బీవీసీ ఇంజినీరింగ్ విద్యా సంస్థకు చెందిన 27 బస్సులను తనిఖీ చేసినట్టు ఆయన తెలిపారు. రవాణాశాఖ అధికారులు జిల్లాలో ప్రతి విద్యా సంస్థకు వచ్చి బస్సులు తనిఖీ చేస్తారని వివరించారు. బస్సులలో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారం తదితర అంశాలను వారు పరిశీలిస్తారని తెలిపారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ పాల్గొన్నారు.


