బండతో మోదీసేరు! | - | Sakshi
Sakshi News home page

బండతో మోదీసేరు!

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

సాక్షి, అమలాపురం: అందరూ ఊహించినట్టే జరిగింది. అమెరికా–ఇరాన్‌ యుద్ధం తొలి దెబ్బ వాణిజ్య సిలిండర్‌పై పడి పరోక్షంగా వినియోగదారులపై పడింది. ఐదు రాష్ట్రల ఎన్నికల తరువాత పెట్రో ధరలు పెరుగుతాయనే నేపథ్యంలో కేంద్రం తొలి పంజా విసిరింది.

వాణిజ్య అవసరాల గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.993.50 పెంచింది. రూ.2,019.5 ఉన్న 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర తాజా పెంపుతో రూ.3,184కు చేరింది. ఈ హఠాత్‌ పరిణామంతో చిరు వ్యాపారుల నుంచి హోటల్‌ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోతున్నారు. ధర పెరుగుతుందని ఊహించారు కానీ ఈ స్థాయిలో పెరుగుతుందని వారు అనుకోలేదు. ఈ పెరిగిన ధరలతో తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసే వారు వాపోతున్నారు. సహజంగానే తమ వంటకాలకు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఈ సమయంలో రూ.వెయ్యి పెంచితే ఇక లాభాలేం వస్తాయని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. సిలిండర్‌ ధరల పెంపుతో ఇటు బడ్డీల వద్ద.. అటు రెస్టారెంట్‌ల వద్ద కూడా తయారు చేసే అల్పాహారం, బిర్యానీలు, భోజనాల ధరలు పెరగనున్నాయి. ఈ భారం పరోక్షంగా వినియోగదారులపై పడనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాలవారూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో గృహ అవసరాల గ్యాస్‌ ధర రూ.50 పెంచిన విషయం తెలిసిందే. అయితే వీటి ధరలు సైతం మరోసారి పెరుగుతాయనే ప్రచారంతో గృహ వినియోగదారులు గుండెల్లో గుబులు రేపుతోంది.

కొనసాగుతున్న కొరత

యుద్ధం మొదలైన నాటి నుంచి వాణిజ్య అవసరాల గ్యాస్‌ సిలిండర్లు దొరకడం లేదు. దీనికి తీవ్ర కొరత నెలకొంది. ఆ మధ్య వారం రోజుల పాటు గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్‌ సిలెండర్లకు డిమాండ్‌ ఏర్పడిన తరువాత పరిస్థితి సద్దుమునిగింది. కాని వాణిజ్య అవసరాల గ్యాస్‌ దొరకడం లేదు. ఇప్పటికే దీనిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.

నిన్న, మొన్నటి వరకు వాణిజ్య అవసరాల గ్యాస్‌ ధర రూ.2,190.50 ఉండగా రూ.మూడు వేలు చేసి బ్లాక్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

నల్ల బజారుకు మరింతగా..

జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 1,731 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా జిల్లాలో బడ్డీలు, తోపుడు బండ్లు, చిన్న చిన్న హోటళ్ల నుంచి అతిపెద్ద రెస్టారెంట్లు వరకు పదిహేను వేలకు పైబడి ఉంటాయని అంచనా. కానీ వాణిజ్య సిలిండర్లు మాత్రం అందులో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలకు వినియోగించడమే. ఇప్పుడు గృహ అవసరాల సిలిండర్‌కు, వాణిజ్య సిలిండరుకు మధ్య ధర ప్రస్తుత వ్యత్యాసం రూ.2,442 వరకు ఉంది. దీనితో గృహ అవసరాల గ్యాస్‌ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించనున్నారు. ఈ కారణంగా వాణిజ్య సిలెండర్లను కాదని గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్‌ను నేరుగా వినియోగించనున్నారు. లేదా గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య సిలిండర్లలోని నింపి వినియోగించనున్నారు.

వాణిజ్య అవసరాల గ్యాస్‌ సిలిండర్లు

వాణిజ్య సిలిండర్‌ ధర పెంపుతో

వ్యాపారుల గగ్గోలు

రూ.993.50 తాజా పెంపుతో

రూ.3,384కు చేరిక

ప్రత్యక్షంగా వ్యాపారులు, పరోక్షంగా

వినియోగదారులపై భారం

పెరగనున్న ఆహార ఉత్పత్తుల ధరలు

జిల్లాలో 1,731 వాణిజ్య సిలిండర్లు

వాస్తవానికి 15 వేలకు పైనే

ఉంటాయంటున్న అధికారులు

బ్లాక్‌ మార్కెటింగ్‌కు మరింత ఊతం

Advertisement
 
Advertisement
Advertisement