పశు సంవర్ధక శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారిగా విజయరెడ్డి | - | Sakshi
Sakshi News home page

పశు సంవర్ధక శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారిగా విజయరెడ్డి

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

అమలాపురం టౌన్‌: పశు సంవర్ధక శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారిగా అమలాపురం సహాయ సంచాలకుడు ఎల్‌.విజయరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేసిన భవాని ప్రసాద్‌ ఉద్యోగ విరమణ చేయడంతో విజయరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, జేసీ నిడియాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన తన కార్యాలయంలో శనివారం పశు వైద్యులు, అధికారులతో సమీక్షించారు. జిల్లా అధికారి భవాని ప్రసాద్‌తో పాటు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కర్నీడి మూర్తి కూడా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో డాక్టర్‌ కె.చంద్రశేఖరరెడ్డి ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

బాలాజీకి రూ.3.22

లక్షల ఆదాయం

మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తల నీలాలు సమర్పించారు. సుప్రభాత సేవ, తొలి హారతి కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3.22 లక్షలు ఆదాయం వచ్చింది. స్వామి వారిని 7,100 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,200 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,13,503 విరాళంగా అందించారని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు.

పెళ్లి కొడుకు అదృశ్యం

ఉప్పలగుప్తం: పెళ్లి కొడుకు అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఎస్‌కే జానీ బాషా కథనం మేరకు గోపవరానికి చెందిన అయినవిల్లి నాగేంద్రకు ఏప్రిల్‌ 29న ఐ.పోలవరం మండలం కేశనకుర్రుకు చెందిన వధువుతో వివాహం జరిగింది. మే 1న పెళ్లి అనంతరం కార్యక్రమాలకు సిద్ధపడుతుండగా అదే రోజు ఉదయం నుంచి తన కుమారుడు కనిపించడం లేదని అతడి తండ్రి రెడ్డమ్మ తనకు ఫోన్‌ చేసినట్టు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, అతని ఆచూకీ తెలిసినవారు 94409 04852కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

సముద్ర నాచు

సాగుకు ప్రోత్సాహం

అమలాపురం రూరల్‌: తీరప్రాంత మత్స్యకారులు, డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి సముద్ర నాచు సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం కేరళలోని అమృత యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్‌ ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు జపాన్‌ శాస్త్రవేత్తలతో కలిసి సముద్రపు నాచు పెంపకంపై అధ్యయనానికి జిల్లాకు వచ్చారన్నారు. డీఆర్డీఏ పీడీ డి.రాంబాబుతో కలిసి కాట్రేనికోన మండలం చిరయానం గచ్చకాయల పోరలలోని చెరువులను, సముద్రాన్ని వారు పరిశీలించారన్నారు. ఈ సాగు చేపట్టే లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుందన్నారు.

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కోనసీమ జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించి జిల్లాలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నివారణకు 661 ఈగిల్‌ క్లబ్బులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌ మీనా, రెవెన్యూ అధికా రులు పాల్గొన్నారు.

ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలి

ఐదేళ్లు నిండిన ప్రతి బిడ్డను బడిలో చేర్పించడమే లక్ష్యంగా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, జిల్లా విద్యాశాఖను ఆదేశించారు. శనివారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.

నేటి నుంచి రెమిడియల్‌ తరగతులు

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం సోమవారం నుంచి ప్రత్యేక రెమిడియల్‌ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement