● తండ్రి కళ్లెదుటే కుమార్తె మృతి
● దైవ దర్శనానికి వెళ్తుండగా ఘటన
బైక్‌ను ఢీకొన్న టిప్పర్
కొత్తపేట: కళ్ల ఎదుటే కన్న బంధం వీడిపోయింది.. దైవ దర్శనానికి తండ్రీ కుమార్తె వెళ్తుండగా, వెనుక నుంచి టిప్పర్ ఢీకొన్న ఘటనలో తండ్రి కళ్లెదుటే తన చిట్టితల్లి మృతిచెందడం కలచివేసింది. స్థానిక బోడిపాలెం వంతెన సమీపంలో జరిగిన ఘటనపై ఎస్సై జి.సురేంద్ర కథనం మేరకు అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విళ్ల వీర్రాజు కుమార్తె గీతారాణి (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమె స్వగ్రామానికి రావడంతో శనివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు బైక్‌పై ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి బయలు దేరారు. వారు బోడిపాలెం వంతెన సమీపానికి చేరుకోగా, వాడపాలెంలో ఇసుక దిగుమతి చేసి ఊబలంక ర్యాంపునకు వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి బలంగా ఢీకొని బైక్‌ను సుమారు 30 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో గీతారాణి తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కాగా వీర్రాజు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన 108 సిబ్బంది యువతిని పరీక్షించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వీర్రాజును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని గీతారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీర్రాజు నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
రెండు రోజులు సెలవులని వచ్చి..
వీర్రాజు కొబ్బరికాయల వ్యాపారి. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె గీతారాణి బీటెక్ చదివి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం సెలవు పెట్టి ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చింది. శనివారం తండ్రితో వాడపల్లి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో చేయి విరిగి, తీవ్ర గాయాలపాలై షాక్‌కు గురైన తండ్రిని ఆ దారిన పోయేవారు లేపగా నా పాప ఏదీ అంటూ గీతారాణి మృతదేహం దగ్గరకు వచ్చి అమ్మా.. లే అమ్మా అంటూ రోదిస్తూ తల్లడిల్లిపోయాడు.
నేనే నీ నిండు ప్రాణాలు బలి గొన్నాను!
అయినవిల్లి: శనివారం తెల్లవారు జామున ఐదు గంటలకు వాడపల్లి వెళ్లేందుకు అలారం పెట్టుకుందని, అయితే ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని, తనకు కూడా పనులు ఉన్నాయని రెండు గంటలకే నిద్రలేపి తయారై తన వాహనంపై వెళ్లామని వీర్రాజు అన్నారు. కుమార్తె చెప్పినట్టే ఐదు గంటలకు బయలుదేరి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేదని, తన వల్లే తన చిట్టితల్లి మృతి చెందిందని ఆయన భోరున విలపించాడు. వాడపల్లి దర్శనానికి వెళ్లిన తన కుమార్తె గీతారాణి విగత జీవిగా తిరిగి రావడంతో ఆమె తల్లి పద్మ ఇంటి వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. కుమార్తె మృత దేహాన్ని చూసి ఏం జరిగిందో తెలియక బిత్తర చూపులు చూస్తుండడంతో చూపరులు చలించిపోయారు. ఈ ఘటనతో చింతనలంకలో విషాదఛాయలు అలముకున్నాయి.


