వ్యక్తిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై హత్యాయత్నం

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

మలికిపురం: గుడిమెళ్లంక గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎస్సై పీవీవీ సురేష్‌ కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన పాస్టర్‌ పోలినాటి యూసఫ్‌ రాజు (రవి రాజు)కు ఇద్దరు భార్యలు, వారికి సంతానం ఉన్నారు. ప్రస్తుతం వరంతా అతనికి దూరంగా ఉంటున్నారు. దీంతో మూడేళ్లుగా గుడిమెళ్లంకకు చెందిన దివ్యాంగురాలు విజయకుమారితో అతడు సహజీవనం చేస్తున్నాడు. ఆమెను కొన్నాళ్లుగా చిత్రహింసలు పెడుతుండడంతో ఆమె తమ్ముడు బండారు నాగరాజు తన సోదరిని శుక్రవారం తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన యూసఫ్‌రాజు అక్కడికి వచ్చి ఇంటిలోకి పెట్రోలు పోయడంతో పాటు, ఇంటి ఎదుట ఉన్న బైక్‌పై కూడా పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. దీంతో బయటకు వచ్చిన నాగరాజు కర్రతో యూసఫ్‌ రాజును కొట్టడంతో పాటు అక్కడే ఉన్న కత్తితో చేతులు, మెడ, దవడలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రాజును కాకినాడ ఆస్పత్రికి తరలించగా కోలుకుంటున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సర్కారు మార్కు ట్రీట్మెంట్‌!

రాజోలు: రోగులంటే చిన్నచూపు.. నిర్లక్ష్యం.. ఆపై అవమానాలు తప్పవని రుజువు చేశారు రాజోలులోని సామాజిక ఆస్పత్రి సిబ్బంది. శుక్రవారం రాత్రి తీసువచ్చిన యూసఫ్‌ రాజును బెడ్‌పై పడుకోబెట్టారు. అతడి గాయాలకు తాళలేక బెడ్‌ పైనుంచి పడిపోయి ఆర్తనాదాలు పెడుతున్నా అక్కడి సిబ్బంది ఏమాత్రం స్పందించలేదు. చివరకు అతడి పరిస్థితి తీవ్రంగా ఉందని, అత్యవసర వైద్యం కోసం కాకినాడకు తీసుకెళ్లాలని డ్యూటీ డాక్టర్‌ అనూష సూచించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డయానాను వివరణ కోరగా.. యూసఫ్‌రాజు మద్యం మత్తులో ఉన్నాడని, ప్రథమ చికిత్స చేస్తున్నపుడే బెడ్‌ పైనుంచి పడి మలమూత్ర విసర్జన చేయడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారైందని తెలిపారు. అతడితో ఎవరూ సహాయకులు రాకపోవడంతో శానిటేషన్‌ సిబ్బంది వచ్చి శుభ్రం చేసే వరకు ఫ్లోర్‌పైనే ఉన్నాడని ఆమె తెలిపారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో కాకినాడకు తరలించామన్నారు. బాధితుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యాల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement