వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్‌వర్క్ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్ ఫినిషింగ్ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు.
లేబర్ కాంట్రాక్టర్ దౌర్జన్యం!
కడియం: మండలంలోని మాధవరాయుడుపాలెం పరిధిలోని చైతన్యనగర్‌లోని ఏపీ పేపరుమిల్లులో ఒక లేబర్ కాంట్రాక్టర్ కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ, దౌర్జన్యం చేస్తున్నాడని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తమ దీక్షా శిబిరం సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు కాంట్రాక్టర్ దౌర్జన్యాలను కార్మికులు వివరించారు. మిల్లులో ఉన్నతాధికారుల వద్ద నమ్మకస్తుడిగా వ్యవహరిస్తూ సదరు లేబర్ కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడంటున్నారు. పే స్లిప్పులు ఇవ్వకపోవడం, సెలవు అడిగితే మర్నాడే పనికి రావద్దనడం వంటివి చేస్తున్నాడని వివరించారు. ఈ మేరకు నాయకులు యాజమాన్యంతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా
డాక్టర్ వసుంధర
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌వోగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ ఎన్.వసుంధరను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు గురువారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వసుంధర శుక్రవారం బొమ్మూరులోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.


