రెండో స్థానాన్ని పదిలం చేశారు | - | Sakshi
Sakshi News home page

రెండో స్థానాన్ని పదిలం చేశారు

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అత్యున్నత మార్కులు సాధించిన

ఐదుగురు విద్యార్థులకు అభినందన

అమలాపురం రూరల్‌: క్రమశిక్షణ, ఏకాగ్రతతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పదో తరగతి విద్యార్థులు నిరూపించారని, జిల్లాను రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపారని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. గురువారం నాటి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐదుగురిని ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి కలెక్టరేట్‌లో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ పి.నాగేశ్వరరావు జిల్లాలో 590 మార్కులు పైబడిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 12 మంది వరకు ఉన్నారని, మొత్తం 241 ప్రభుత్వ పాఠశాలలకు 94 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, 145 పాఠశాలలు 61.99 శాతం ఉత్తీర్ణత, రెండు పాఠశాలలు 60 శాతం లోపు ఉత్తీర్ణత సాధించాయని కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 596 మార్కులు సాధించిన ఎస్‌ఆర్‌ఎల్‌ నిహారిక, 595 సాధించిన ఎన్‌.కృతిక, జీహెచ్‌ సత్య దుర్గ, 593 మార్కులు సాధించిన సీహెచ్‌ జ్యోతి, కె.అభిశ్రీలను కలెక్టర్‌, ఎస్పీ అభినందించారు. వారితో పాటు జిల్లా ఉప విద్యాశాఖాధికారి జి.సూర్యప్రకాశం ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

పుష్కరాల వసతులపై అంచనాలు ఇవ్వండి

గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు, వసతుల కల్పనకు నాలుగు రోజుల్లో అంచనాలు సమర్పించాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. కోనసీమ ప్రాంతంలో సుమారు 1.5 కోట్ల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

విలువిద్యకు నవశకం

మండలం కామనగరువు చల్లపల్లి రోడ్డులో ఉన్న ది అమలాపురం కళాశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సాయి విలువిద్య సంస్థ వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. విలువిద్యకు నవశకం తీసుకువచ్చేలా శాప్‌ సరికొత్త అడుగు వేసిందని ఆయన అన్నారు.

పీఎండీఎస్‌ సాగు ఎంతో కీలకం

ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున భూములలోని తేమను కాపాడుకుని భూసారాన్ని పెంచడానికి డైరెక్ట్‌ మాన్సూన్‌ డ్రై షోయింగ్‌ (పీఎండీఎస్‌) సాగు ఎంతో కీలకమని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పీఎండీఎస్‌ సాగు కిట్ల పంపిణీ, సాగు విస్తీర్ణాలపై సమీక్షించారు.

జలధార పనులు వేగవంతం చేయాలి

భూగర్భ జలాలు పెంచే దిశగా జలధార పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement