ఘనంగా సత్యదేవుని శ్రీ చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సత్యదేవుని శ్రీ చక్రస్నానం

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

అన్నవరం: శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు వైశాఖ పౌర్ణమి, శుక్రవారం ఉదయం పంపానదిలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు.ఉదయం 8–30 గంటలకు పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను, ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ మండపం లోపల గల సింహాసనం మీద స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పండితుల మంత్రోచ్ఛాటన మధ్య స్వామివారికి, శూలానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, నెయ్యితో అవభృతస్నానం చేయించారు.

విభిన్నంగా శ్రీచక్రస్నానం

పంపా నదిలో సత్యదేవుని శ్రీచక్రస్నానం ఈసారి వాడపల్లిలో జరిగినట్టుగా విభిన్నంగా నిర్వహించారు. అవభృత స్నానం అనంతరం సత్యదేవుని ఉత్సవ మూర్తిని, శూలాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. అనంతరం ఒడ్డున నిర్మించిన ఇనుప మంచె మీదకు స్వామివారిని, శూలాన్ని తీసుకువచ్చి పైపు ద్వారా నదిలో నీటితో శూలాన్ని అభిషేకించగా ఆ మంచె కింద ఉన్న భక్తులు స్నానం చేశారు. సాయంత్రం అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. రంగులతో నాగవల్లిని తీర్చిదిద్ది పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నీలలోహిత మాల (నల్లపూసల దండ) ధారణ చేశారు. స్వామి కల్యాణం నాడు ఆరోహించిన ధ్వజాన్ని అవరోహణ చేశారు. అర్చకస్వాములు కంకణ విమోచనం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement