జెండా ఎగరేసిన
అల్లవరం మండలం
● టాప్ టెన్‌లో నలుగురికి చోటు
● సామంతకుర్రు విద్యార్థికి
జిల్లా ప్రథమ స్థానం
అల్లవరం: పదవ తరగతి ఫలితాల్లో అల్లవరం మండలంలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి మండలాన్ని అగ్రస్థానంలో ఉంచారు. సామంతకుర్రు ఉన్నత పాఠశాలకు చెందిన శిరిగినీడి రిషిత లక్ష్మీ నిహారిక 596 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థి కాకిలేటి దేవిశ్రీప్రసాద్ 592 మార్కులతో, ఓడలరేవు ఉన్నత పాఠశాలకు చెందిన మోకా లాస్య 592 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాలకు చెందిన పోతు దుర్గాలక్ష్మీ సాహితి 591 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా విద్యా శాఖ విడుదల చేసిన టాప్ టెన్ జాబితాలో అల్లవరం మండలానికి చెందిన నలుగురు చోటు దక్కించుకొని మండలాన్ని అగ్రస్థానంలో ఉంచారని ఎంఈఓలు కిరణ్‌బాబు, ఎస్.ఏడుకొండలు తెలిపారు.
సాక్షి, అమలాపురం: పదవ తరగతి ఫలితాలలో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఏడాది ఫలితాన్ని అధిగమించ లేకపోయినప్పటికీ అదే స్థానాన్ని నిలుపుకున్నారు. జిల్లా 95.85 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలు జిల్లా విద్యాశాఖ అధికారులలో ఉత్తేజాన్ని నింపాయి. పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11 గంటలకు పదవ తరగతి ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిన జిల్లా జోన్–2 పరిధిలో మొదటి స్థానం సాధించింది. గత ఏడాది జోన్ –2 పరిధిలో రెండవ స్థానం రావడం గమనార్హం.
బాలికలదే పై చేయి
పది ఫలితాలలో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 9,570 మంది బాలురు, 9,568 మంది బాలికలు కలిపి 19,138 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో బాలురు 9,102 (95.11శాతం), బాలికలు 9,241 (96.58శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 18,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,253 మంది ఉత్తీర్ణత (91.43శాతం) సాధించగా, గత విద్యా సంవత్సరంలోనూ బాలికలే పైచేయి సాధించారు. 9,392 మంది బాలురు, 9,479 మంది బాలికలు కలిపి 18,871 మంది పరీక్షలకు హాజరు కాగా, బాలురు 8,420 (89.65 శాతం), బాలికలు 8,833 (93.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే బాలురు, బాలికల ఉత్తీర్ణతా శాతం కూడా పెరగడం గమనార్హం.
పెరిగిన ఫస్ట్ క్లాస్‌లు
జిల్లాలో 18,343 మంది ఉత్తీర్ణత సాధించగా వీరిలో 16,866 (92 శాతం) మంది ప్రథమ శ్రేణిలో, 1,161 (6శాతం) మంది ద్వితీయ శ్రేణిలో, 316 (2 శాతం) తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. 795 మంది ఫెయిలయ్యారు. గత ఏడాది ఫలితాలతో పోల్చితే మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినవారు 2,362 మంది పెరిగారు.
పటిష్టమైన ప్రణాళికతో..
పది ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా విద్యార్థులను పరీక్షలకు తీర్చిదిద్దడం ఒక కారణం. జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది రెండవ స్థానంలో నిలవడంతో ఈ ఏడాది ఫలితాలు విద్యాశాఖకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో తొలి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో పనిచేశారు. 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంల నుంచి ఆర్‌జేడీ స్థాయి వరకు పదవ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. పదవ తరగతి విద్యార్థులకు 100 రివిజన్ టెస్టులు, మూడు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించడం ఫలితం చూపించింది.
సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలు..
ప్రభుత్వ పాఠశాలలు పది ఫలితాల్లో సత్తా చాటాయి. మండల, జెడ్పీ యాజమాన్యంలో 209 పాఠశాలలకు 87, ప్రభుత్వ యాజమాన్యంలో 8 పాఠశాలలకు రెండు, ఎయిడెడ్ యాజమాన్యంలో ఒకటి, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు రెండుకు రెండు, సాంఘిక సంక్షేమ వసతి పాఠశాలలు 8 పాఠశాలలకు రెండు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం మీద 241 వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు 94 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 145 పాఠశాలలు 61 నుంచి 99 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండు పాఠశాలలు మాత్రం 60 లోపు ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావుతో పాటుగా జిల్లా యంత్రాంగాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తస్లీమ్ అన్సారియా, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులరెడ్డి అభినందించారు. డీవైఈవోలు జి.సూర్యప్రకాష్, పి.రామలక్ష్మణమూర్తి, కడలి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో
రెండో స్థానంలో నిలిచిన కోనసీమ
జిల్లాలో 95.85 శాతం ఉత్తీర్ణత
బాలుర ఉత్తీర్ణత 95.11 శాతం
బాలికల ఉత్తీర్ణత 96.58 శాతం
సంతృప్తికరం
పది ఫలితాలు సంతృప్తి ఇచ్చాయి. రాష్ట్రంలో జిల్లా 2వ స్థానంలో నిలవడం సంతోషాన్నిచ్చింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పర్యవేక్షణ చేయడంతో ఈ ఫలితాలు సాధించగలిగాం.
– పి.నాగేశ్వరరావు, డీఈవో,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.


