కపిలేశ్వరపురం: ఉన్న ఊరును విడిచి పనులు.. ఉత్తుత్త వేతనాలు.. కార్మికుల నోటికి కూడు అందని పరిస్థితులు.. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్‌బుక్ పాలనతో అణచివేత ధోరణులు.. ఫలితంగా కార్మిక, కర్షకులకు తీరని వెతలు.. సంపద సృష్టిస్తానంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రామికులు సృష్టించిన సంపదను వారికి దూరం చేస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి నెట్టేశారు. శ్రామికుల జీతభత్యాలు కుటుంబ అవసరాలు తీర్చే స్థాయిలో లేవు. శుక్రవారం మే డే సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శ్రమజీవుల సమస్యలపై కథనం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 107 మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ శ్రామిక శక్తితో భారీ ఉత్పత్తి ఎగుమతి అవుతోంది. అలాగే 4,53,027 హెక్టార్లలో వరి సాగవుతుంది. వ్యవసాయానికి అనుబంధంగా రవాణా, రైసుమిల్లు రంగాలు ఉన్నాయి. కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరంలో వర్తక, వ్యాపారాలు, కోనసీమ జిల్లాలో ఆక్వా, కొబ్బరి, పోలవరం జిల్లాలో అటవీ సంపద సృష్టిలో శ్రామికులు పనిచేస్తున్నారు. అలాగే 6,782 మంది అంగన్‌వాడీలు సేవలందిస్తున్నారు. సుమారు 5,33,815 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. నాలుగు జిల్లాల్లో వేలాది మంది సచివాలయ, తదితర రంగాల ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఉద్యమాలు.. కార్యచరణలు
ఫ ఈ నెల 17న సమగ్ర శిక్ష కార్యాలయాల కాంట్రాక్టు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశమయ్యారు. తమ వేతనాలు పెంచాలంటూ మే నెల 15న విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి మంత్రి లోకేష్ నివాసం వరకూ పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ఫ ఈ నెల 16న కాకినాడలో పెన్షన్ సాధన కమిటీ సమావేశం నిర్వహించి, పాత పింఛను విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
ఫ కాకినాడలో ఈ నెల 25న జిల్లా స్వర్ణకారుల సంఘం సమావేశం నిర్వహించారు. 50 ఏళ్లు నిండిన స్వర్ణకారులకు నెలకు రూ.8 వేల పింఛన్ ఇవ్వాలంటూ నాయకులు డిమాండ్ చేశారు.
ఫ మార్చి 24న యూటీఎఫ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు నాలుగు ఉమ్మడి కలెక్టరేట్‌ల ఎదుట రణభేరి పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఫ తమ జీతాలు పెంచాలంటూ సహకార సంఘాల ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరిలో సమ్మె నిర్వహించి కొన్ని డిమాండ్లను సాధించుకున్నారు.
ఫ ఫిబ్రవరి 20న రాజమహేంద్రవరంలో విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వహించాలంటూ ఆర్టీసీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
శ్రామిక మహిళా ఉద్యమాలిలా..
ఫ తమకు పనులు కల్పించడం లేదంటూ ఈ నెల 13న అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఉప్పలగుప్తం మహిళా ఉపాధి కూలీలు ధర్నా చేశారు.
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24న అంగన్‌వాడీలు నిరసన ర్యాలీలు చేశారు.
ఫ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5న ఆశ కార్యకర్తలు విజయవాడలో నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
శ్రామికులపై నిర్బంధకాండ
ఫ మార్చి 3న విజయవాడలో అంగన్‌వాడీల శాంతియుత మహా ధర్నాలో మంత్రుల ఆదేశాలపై విధ్వంసం సృష్టించారు. అనేక మంది పోలీసులు వచ్చి టెంట్లు పీకేసి వందల మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
ఫ చేనేత సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల13 నుంచి 20 వరకూ కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 నుంచి తాటిపర్తి కల్యాణ మండపంలో ఆమరణ దీక్ష చేస్తుండగా, పోలీసులు ఈ నెల 22న భగ్నం చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ఇలా..
కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు 2024 ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యలంటూ హామీలను విస్మరిస్తున్నారు. ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంది. పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని చెప్పి విస్మరించారు. వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ)ను నియమించి ప్రభుత్వ ఉద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాలన్న డిమాండ్ గాలికి వదిలేశారు. ఈ నెల 22న కాకినాడలో జిల్లా కలెక్టర్‌కు గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్–1 వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలంటూ వినతి పత్రం అందజేశారు.
ఫ శ్రామికవర్గంపై రెడ్‌బుక్ పాలన
ఫ కూటమి పాలనలో దయనీయ పరిస్థితులు
ఫ ఇచ్చిన హామీలను అడిగితే నిర్బంధం
ఫ నేడు ప్రపంచ కార్మికవర్గ దినోత్సవం


