వైభవంగా శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఆలయం నుంచి రెండు వేరువేరు వాహనాలపై అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. వివిధ ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధువరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ఈఓ వేండ్ర త్రినాథరావు, దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావులు పట్టు వస్త్రాలను సమర్పించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 8 గంటలకు – భజన కార్యక్రమాలు
ఉదయం 10 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు
సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వర కచేరి
సాయంత్రం 5 గంటల నుంచి – హరికథ
సాయంత్రం 6 గంటల నుంచి – భక్తి రంజని
రాత్రి 7 గంటల నుంచి – భరత నాట్య ప్రదర్శనలు
రాత్రి 8 గంటల నుంచి – మోహిని భస్మాసుర నాటకం
రాత్రి 8 గంటల నుంచి – శ్రీవారి రథోత్సవం
అలంకారం : శ్రీ కూర్మ అలంకారం
మోహినీ అలంకారంలో చినవెంకన్న
ముగ్ధ మనోహర రూప లావణ్యాలను ఒలికిస్తూ.. మోహినీ అలంకారంలో శ్రీవారు గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తున్నారు. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవ, దానవులకు పంచేందుకు శ్రీమహావిష్ణువు జగన్మోహినీగా మారారు. అపురూప సౌందర్యాలను ఒలికిస్తూ.. సీ్త్ర రూపంలో ఉన్న చిన్నతిరుమలేశుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు.


