● ఓపెన్ స్కూల్ ఫలితాల్లోనూ
బాలికలదే పైచేయి
● పది, ఇంటర్ ఫలితాల్లో
ప్రథమ స్థానంలో నిలిచిన కోనసీమ
రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయాయి. రెగ్యులర్ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి కాగా, ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాల్లోనూ బాలికల హవా కన్పించింది. గత నెల 2 నుంచి 13వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, గత నెల 16 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ టెన్త్ పరీక్షలు నిర్వహించారు.
పది, ఇంటర్ ఫలితాల్లో
మొదటి స్థానంలో కోనసీమ
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పది ఫలితాల్లో 83.07 శాతం ఉత్తీర్ణతతో కోనసీమ మొదటి స్థానంలో నిలిచింది. ఓపెన్ టెన్త్‌కు కోనసీమ జిల్లా నుంచి 1,122 మంది హాజరు కాగా 932 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 80.25 (524), బాలికల ఉత్తీర్ణతా శాతం 86.99 (408) ఉంది.
ఓపెన్ ఇంటర్ ఫలితాల్లోనూ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (79.55శాతం)తో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. కోనసీమ జిల్లా నుంచి 4,142 మంది పరీక్షకు హాజరు కాగా 3,295 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 78.48 శాతం, బాలికల ఉత్తీర్ణత 81.16 శాతంగా ఉంది.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ఫెయిలైన వారికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశముంది. మే 2 నుంచి 11వ తేదీ వరకు ఏపీ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫీజు చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీ కౌంటింగ్‌కు రూ.200 వంతున చెల్లించాలి. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం వెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెగ్యులర్ ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను అనుసరించి జరుగుతాయి. మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. పరీక్ష రుసుమును మే 2 నుంచి 11వ తేదీ వరకు ఏపీటీ ఆన్‌లైన్ ద్వారా లేదా పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించవచ్చు.


