● రీజెన్సీ ఫ్యాక్టరీ స్థాపించి
వందలాది కార్మికులకు ఉపాఽధి
● దక్షిణ భారతదేశంలో
సిరామిక్స్ రంగం వ్యాప్తికి కృషి
● సంతాప సూచకంగా వ్యాపార సంస్థల బంద్
యానాం: స్థానిక రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ భారీ పరిశ్రమ, దాని అనుబంధ సంస్థల వ్యవస్థాపకుడు, పారిశ్రామిక దిగ్గజం డాక్టర్ జీఎన్ నాయుడు బుధవారం కన్నుమూశారు. ఆయన దక్షిణ భారతదేశంలో సిరామిక్స్ పరిశ్రమ వ్యాపించడానికి విశేష కృషి చేశారు. 1983లో యానాంలో రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమలు దక్షిణభారతదేశమంతటా వ్యాపించడంలో కీలకపాత్ర పోషించారు. ఫ్యాక్టరీ స్థాపించడంతో అప్పటివరకు వెనుకబడి ఉన్న యానాం నియోజకవర్గం అనతికాలంలోనే కార్మికులకు ఉపాధి, విద్యాసేవలు, టైల్స్ పరిశ్రమకు కావాల్సిన వాటిని అందించేందుకు ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థలతో వైభవాన్ని సంతరించుకుంది. పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక వ్యాపార సంస్థలు ఎంతగానో అభివృద్ధి సాధించాయి. ఇంజినీరింగ్ రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ప్రదానం చేసింది. 2012 జనవరి 27 జరిగిన దుర్ఘటనతో మూతపడిన రీజెన్సీ పరిశ్రమను మళ్లీ ప్రారంభించేలా రూ.100 కోట్ల పెట్టుబడితో ప్రణాళికలు రూపొందించారు. రోజుకు 7వేల చదరపు మీటర్ల నుంచి 25వేల చదరపు మీటర్ల టైల్స్‌ను హెల్త్‌కేర్, హాస్పాటాలిటీ రంగాలకు ప్రత్యేకంగా తయారు చేసేలా మరమ్మతులు చేపట్టారు. దీంతో ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉంది. కార్మికుల పిల్లల కోసం రీజెన్సీ పబ్లిక్‌స్కూల్, జూనియర్, ఇంజనీరింగ్, బీఈడీ కాలేజీలను స్థాపించారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైతం ఏర్పాటు చేశారు.
కట్నం తీసుకోకుండా
పెళ్లి చేసుకుంటే ఫ్యాక్టరీలో ఉద్యోగం
ఫ్యాక్టరీ అనుబంధ సంస్థ రిగ్మా యూనిట్‌లో పని చేసే యువతులను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అటువంటి వారి భర్తలకు ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రకటించి అమలు చేసి అందరి మన్ననలు పొందారు డాక్టర్ జీఎన్ నాయుడు.
రీజెన్సీ కార్మికుల నివాళి
రీజెన్సీ కార్మికులు నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో నందగిరి హిల్స్, జూబ్లిహిల్స్ వద్ద జరుగుతాయి. నాయుడు మృతికి సంతాప సూచకంగా యానాంలో వ్యాపార సంస్థలను మూసివేశారు.


