పెట్రోగిపోతున్నా పట్టదా? | - | Sakshi
Sakshi News home page

పెట్రోగిపోతున్నా పట్టదా?

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

నానాటికీ తీవ్రమవుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్యను చంద్రబాబు సర్కారు పరిష్కరించకపోవడాన్ని ఖండిస్తూ మంగళవారం వైఎస్సార్‌ సీపీ నాయకులు జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు. ఆటోలు, ట్రాక్టర్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్‌ బంకుల వద్దకు వెళ్లి అక్కడ బారులు తీరిన రైతులు, వాహనాల డ్రైవర్లు, సామాన్య జనంతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి మజ్జిగ అందజేశారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో గృహిణులు, వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. బంకుల్లో ఆయిల్‌ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

వినియోగదారుల పక్షాన పోరాడతాం : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ

బంకుల వద్ద పూర్తి స్ధాయిలో అయిల్‌ నిల్వలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనకపోతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినియోగదారుల పక్షాన పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ హెచ్చరించారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి పెట్రోలు బంక్‌ వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కోసం వినియోగ దారులు పడుతున్న ఇక్కట్లను స్వయంగా పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణం:

మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరిదేవి

ఇంధన కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని రాజోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో–ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె రాజోలులోని ఆర్టీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ కావాలంటే సిఫారసు లేఖలు తెచ్చుకోవలసిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు.

ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం : గన్నవరపు శ్రీనివాసరావు

పెట్రోల్‌, డీజిల్‌ కోసం రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. నగరం పెట్రోల్‌ బంక్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యకమంలో ఆయన మాట్లాడుతూ విజనరీ పాలన అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమేనా చంద్రబాబూ అని ప్రశ్నించారు.

నేరం అధికారులపైకి నెట్టేస్తున్నారు :

పిల్లి సూర్యప్రకాశ్‌

క్రెడిట్‌ చోరీకి పాల్పడే సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌ కొరత అధికారుల మూలంగానే ఏర్పడిందంటూ నేరం అధికారులు మీద నెట్టివేస్తున్నారని రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్‌ ధ్వజమెత్తారు. రామచంద్రపురం రాజగోపాల్‌ సెంటర్‌లో గల హెచ్‌పీసీఎల్‌ బంకు వద్ద నిరసన వ్యక్తం చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.

కొరత రాష్ట్రంలోనే ఎందుకు?: శివకుమార్‌, డేవిడ్‌రాజు

పెట్రోల్‌, డీజిల్‌ కొరత మన రాష్ట్రంలోనే ఎందుకు ఏర్పడిందో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు ఆలోచన చేసి, సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్‌, ఆ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు డిమాండ్‌ చేశారు. కొత్తపేటలో పెట్రోలు బంకు వద్ద ప్రజలు, రైతులకు మద్దతుగా వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement