తొలగని చముర్జెన్సీ! | - | Sakshi
Sakshi News home page

తొలగని చముర్జెన్సీ!

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

సాక్షి, అమలాపురం: డీజిల్‌ కొరత సామాన్యులు, మధ్య తరగతి, రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉచిత బస్సు పథకం తరువాత కిరాయిలు తగ్గి నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్న ఆటో డ్రైవర్ల మీద డీజిల్‌ కొరత పిడుగులా పడింది. వరి కోతలు, మామిడి వంటి పండ్ల అమ్మకాల సీజన్‌లో చేతి నిండా బేరాలున్నా రవాణా ఆటోలు, మినీ వ్యాన్‌ చక్రాలు డీజిల్‌ లేక కదలకపోవడంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు వరి కోతలు, కుప్ప నూర్పిడులు, మరోవైపు ధాన్యం రవాణా జరిగే ముమ్మర సీజన్‌లో డీజిల్‌ దొరకకపోవడంతో ట్రాక్టర్‌ యజమానులు, రైతులు ఆవేదనతో గడుపుతున్నారు.

జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన పెట్రోల్‌, డీజిల్‌ కొరత రానురానూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. కొరత లేకుండా చూస్తాం... కొరతను అధిగమిస్తాం.. రెండు రోజులలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.. అని అధికారులు ఎన్ని ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మెరుగు పడడం లేదు. జిల్లాలో మంగళవారం కూడా పలు బంకులు పెట్రోల్‌, డీజిల్‌ లేక మూతపడడం.. ఉన్నచోట్ల వాహనాల చాంతాండంత క్యూ లు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రధానంగా డీజిల్‌ కొరత సామాన్యులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. మరీ ముఖ్యంగా ఆటోలు.. రవాణా ఆటోలు.. మినీ వ్యానులు.. ట్రాక్టర్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి గడిచిన వారం రోజులుగా రోజువారీ పని లేకుండా చేస్తోంది. దీంతో వారు అర్ధాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది.

నిలిచిపోయిన ఆటోలు

డీజిల్‌ కొరతతో జిల్లాలో సగానికి పైగా ప్రయాణికుల రవాణా ఆటోలు నిలిచిపోయాయి. జిల్లాలో 14 వేలకు పైగా ప్రయాణికుల ఆటోలు ఉండగా, డీజిల్‌ కొరత వల్ల తొమ్మిది వేలకు పైగా ఆటోలు నిలిచిపోయాయని అంచనా. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే ఆటోలు కదలడం లేదు. జిల్లాలో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, సఖినేటిపల్లి, మలికిపురం వంటి సముద్ర తీర ప్రాంత వాసుల ప్రధాన రవాణా వాహనం ఆటో. అటువంటి ఆటోలు డీజిల్‌ కొరతతో మూలనపడడంతో స్థానిక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజు విడిచి రోజు కూడా డీజిల్‌ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.

ట్రాన్స్‌పోర్టు ఆటోలకు సైతం బ్రేక్‌

డీజిల్‌ దొరకక పోవడంతో ప్రయాణికుల ఆటోలతో పాటు రవాణా ఆటోలు కూడా నిలిచిపోతున్నాయి. వీటితోపాటు మినీ వ్యాన్లు కూడా కదలడం లేదు. రావులపాలెం అరటి, ఆలమూరు మండలం మడికి కూరగాయల మార్కెట్‌కు సీజన్‌ కావడంతో మామిడి, పుచ్చకాయ, దోసకాయలు, ఇతర పండ్ల రవాణాలకు ఈ ఆటోలు చాలా కీలకం. అరటి ఉత్పత్తులు, కూరగాయల తరలింపులో ఇవి చాలా కీలకం. వీటితోపాటు అమలాపురం, రామచంద్రపురం వంటి పట్టణాలు, మేజర్‌ పంచాయతీలలో సిమెంట్‌, ఐరన్‌, ఇతర వస్తువుల రవాణా కూడా సాగేది వీటి మీదనే. ఇవి కదిలే పరిస్థితి లేకపోవడం వల్ల వాటి యజమానులతోపాటు ఆయా వ్యాపారులపై కూడా ప్రభావం చూపుతోంది.

కదలని ట్రాక్టరు

డీజిల్‌ కొరతతో ట్రాక్టర్లు కదలడం లేదు. రబీ వరి కోతలు, నూర్పిడులు ముమ్మరంగా సాగుతున్న తరుణం ఇది. ఈ సమయంలోనే ట్రాక్టర్లకు పని ఉండేది. కుప్ప నూర్పిడులు, ధాన్యం రవాణా వంటి పనులలో బిజీగా ఉండాల్సిన సమయంలో డీజిల్‌ లేక వాటిని మూలన పెడుతున్నారు. ట్రాక్టర్ల సహాయంతో వరి కోత యంత్రాలు కోసిన గడ్డిని పశువులకు ఉపయోగపడే విధంగా భద్రపరచుకోవడానికి ట్రాక్టర్‌ చాలా అవసరం. డీజిల్‌ ఉన్న సమయానికి వెళ్తే రెండు, మూడు గంటలు లైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. డీజిల్‌ ఆయిల్‌ తెచ్చుకోవడానికి డబ్బాలను తీసుకొని వెళ్తే బంకుల దగ్గర ప్రభుత్వం చెప్పిందని డబ్బాలలో ఆయిల్‌ పోయడానికి నిరాకరిస్తున్నారు. వాహనాలను తీసుకుని వెళ్తే సమయం అంతా అక్కడ వృథా అవడం వల్ల ఒక పూట పనిపోతోందని వాపోతున్నారు. కూపన్‌ పట్టుకుని వెళుతున్నా డీజిల్‌ లేకపోవడంతో వారు ఇబ్బందుల పాలవుతున్నారు.

రావులపాలెంలో పెట్రోల్‌ బంకు వద్ద

డీజిల్‌ కోసం క్యూ కట్టిన ఆటోలు

అమలాపురంలో డీజిల్‌ లేక

స్టాండ్‌లో ఉంచిన ఆటోలు

ఆగిన జీవన ‘చక్రం’

డీజిల్‌ కొరతతో

నిలిచిపోతున్న ఆటోలు, మినీ వ్యాన్లు

రవాణా ఆటోల పరిస్థితి మరింత దారుణం

కదలని ‘‘ట్రాక్టర్లు’’

కోతలు, నూర్పిడులు, ఽ

దాన్యం రవాణాకు బ్రేక్‌

కీలక సమయంలో నడవని వాహనాలు

ఆందోళనలో యజమానులు

Advertisement
 
Advertisement
Advertisement