అమలాపురం రూరల్: రైతులు ఇబ్బందులు పడుతున్నందున వారికి అడిగినంత డీజిల్ ఇవ్వాలని వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం నాయకులు కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు(బాబి) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ మహేష్‌కుమార్‌కు నాయకులు రైతులతో కలసి వినతి పత్రం అందించారు. బాబి మాట్లాడుతూ జిల్లాలో వరి కోత, ఆక్వా పంట సీజన్ సమయంలో డీజిల్ కొరత ఏర్పడి రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మార్కెట్లో డీజిల్ అధిక ధరలకు అమ్మడం వల్ల వరి రైతులకు పంటకోత ఖర్చు అధికం అవుతోందన్నారు. అధికమైన విద్యుత్ కోతలు, డీజిల్ దొరకక ఆక్వా రైతులకు నష్టం ఏర్పడుతోందన్నారు. ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి డీజిల్ కొరతను పరిష్కరించాలని కోరారు.పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పితాని బాలకృష్ణ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు ఢిల్లీ నారాయణ, గుబ్బల రమేష్, రాష్ట్ర కార్యదర్శి పి.చిట్టిబాబు, నల్లా నరసింహమూర్తి పాల్గొన్నారు.
డిమాండ్‌ను అనుగుణంగా సరఫరా
పెట్రోల్, డీజిల్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు తహసీల్దార్లు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు సమన్వయం వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, నయారా ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గుమ్మళ్లదొడ్డి నుంచి ఆయిల్ సరఫరా సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వరి కోతలకు సంబంధించి డీజిల్ సరఫరాకు సచివాలయ వ్యవసాయ సహాయకులు, ఆక్వారంగా రేడియేటర్ల వినియోగానికి మత్స్య సహాయకులు కూపన్లు జారీ చేస్తారని, వీటి ఆధారంగా రోజువారీ కేటాయింపులు జరిపి ఆయిల్ సరఫరా చేయాలన్నారు. జేసీ వైఖోమ నిడియాదేవి పాల్గొన్నారు.


