పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

అల్లవరం: రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై వ్యవసాయం, ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోతోందని, చిరు వ్యాపారులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారని మాజీ ఎంపీ చింతా అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొరత తీవ్ర స్థాయిలో ఉందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చాలా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు ఏర్పాటు చేసి కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని, సాధారణ ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడవలసి వస్తోందని తెలిపారు. కొన్ని పెట్రోల్‌ బంకుల్లో అధికారుల లెటర్లు ఉంటేనే డీజిల్‌ పోసే పరిస్థితి ఉందన్నారు. డీజిల్‌ కొరతతో వ్యవసాయ, వ్యాపార, ఆక్వా రంగాలు కుదేలవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని చమురు కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని, డీజిల్‌, పెట్రోల్‌ సరఫరాలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కృత్తిమ కొరత సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో డీజిల్‌, పెట్రోల్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలని అనురాధ డిమాండ్‌ చేశారు.

పీజీఆర్‌ఎస్‌కు పోటెత్తిత్తిన అర్జీదారులు

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. పింఛన్లు, భూ సమస్యలు, భూ సర్వే, సాగు, తాగునీటి సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమస్యలు విన్నవించుకుంటున్న పరిష్కారం కావట్లేదని వారు వాపోయారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో భూ సమస్యల ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జేసీ వైఖోమ్‌ నిడియాదేవి, సమగ్ర శిక్ష ఎడిషనల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ జి.మమ్మీ, రెవెన్యూ సేవలతో పాటు ఇళ్లస్థలాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్షన్‌ మంజూరు తదితర సమస్యలపై 195 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేస్తూ నూటికి నూరు శాతం సంతృప్తికర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 25 అర్జీలు

అమలాపురం టౌన్‌: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా, జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌లు ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి ఈ పోలీస్‌ గ్రీవెన్స్‌ను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ తమ సమస్యలపై ఎస్పీ, ఏఎస్పీలకు ఫిర్యాదు పత్రాలు అందించారు. పోలీస్‌ వ్యవస్థపై పూర్తి నమ్మకం కలిగేలా పోలీస్‌ గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులపై డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని ఎస్పీ మీనా ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉండడంతో ఎస్పీ, ఏఎస్పీలు అర్జీదారులను కౌన్సెలింగ్‌ చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు.

జనగణనలో భాగస్వాముల్ని చేసేందుకే 5కే రన్‌

అమలాపురం రూరల్‌: దేశ డిజిటల్‌ జనగణన విధానంలో స్వీయ గణనకు ప్రాధాన్యతనిస్తూ భాగస్వాముల్ని చేసే లక్ష్యంతో 5కే రన్‌ ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నట్టు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అన్నారు సోమవారం కలెక్టరేట్‌ నుంచి గడియార స్తంభం వరకు స్వీయగణనపై చైతన్యం రగిలించేలా 5కే రన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ రన్‌ ద్వారా మన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పరుగులో ఉత్సాహాన్ని పొంది, జనగణన ప్రాముఖ్యతను తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అర్ధ గణాంకాధికారి మురళీకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, పీఆర్‌ ఈఈ అన్యం రాంబాబు, కలెక్టరేట్‌ ఏవో కాశీ విశ్వేశ్వరరావు మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement