అమలాపురం టౌన్: మహిళలపై తన ఆంధ్రజ్యోతి పత్రిక, చానల్ ద్వారా తప్పుడు రాతలు, ప్రసారాలు చేసే ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలు ఆరోపణలతో ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో శ్రీనివాసరావు, పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఏబీఎన్ చానల్‌లో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ ఎంతసేపూ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును మోయడమే అతని అసలు అజెండా అని ధ్వజమెత్తారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పే వరకూ తమ నిరసన ఇలానే కొనసాగుతుందని శ్రీనివాసరావు హెచ్చరించారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావుతో పాటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చింతలపాటి శ్రీనివాసరాజు, అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల పార్టీ అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్, విత్తనాల ఇంద్రశేఖర్, మేడిశెట్టి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్, తోరం భాస్కరరావు, అడ్డగళ్ల సాయిరామ్, మొల్లేటి త్రిమూర్తులు, తోరం గౌతమ్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.


