అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం ఏర్పడిందని రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో నెలకొన్న డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలోని ఈదరపల్లిలో రిలయన్స్, గాయత్రీ పెట్రోల్ బంకుల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈదరపల్లిలో పెట్రోల్ బంక్ వద్దకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్సీ, కోఆర్డినేటర్ల, పార్టీ నాయకులు డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారుల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ పరిపాలనాధక్షుడు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు డీజిల్ సంక్షోభం ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్నారు. సీఎం, మంత్రులు, కలెక్టర్లు, జేసీలు కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. కోనసీమలో నగరంలో ఆయిల్ రిఫైనరీ ఉన్న, ఓడలరేవులో చమురు నిల్వలు ఉన్న రైతులకు డీజిల్, పెట్రోల్ దొరకడం లేదన్నారు. అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రాజోలు కోఆర్డినేటర్ రాజేశ్వరీదేవి మాట్లాడుతూ కోత యంత్రాలకు డీజిల్ లేక వరి కోతలు నిలిచిపోయాయన్నారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే డీజిల్ సంక్షోభం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), అమలాపురం పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్యకుమార్, రాష్ట్ర కార్యదర్శులు చింతలపాటి శ్రీనివాసరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, పాటి శివ, ఎస్‌ఈసీ మెంబర్ కుడుపూడి భరత్ భూషణం, పట్టణ అఽధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్, అల్లవరం మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ తదితరులు పాల్గొన్నారు.


