అమలాపురం టౌన్: రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కేవలం పాలకుడు మాత్రమే కాదని గొప్ప దార్శనికుడని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆయన సేవలను కొనియాడారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. ఎస్పీ మీనా మాట్లాడారు. తొలుత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి ఎస్పీ మీనాతో పాటు జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, ఎస్పీ కార్యాలయ పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి కాలంలో చెరువులు తవ్వించి పేదలకు అన్నదాన సత్రాలు ఏర్పాటుతో పాటు అనేక దేవాలయాలు నిర్మించిన ఆధ్యాత్మిక వేత్త, దాత అని కొనియాడారు. స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ నాగప్రసాద్, ఏఆర్ ఆర్‌ఐ బ్రహ్మానందం, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొని రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సేవలను గుర్తు చేసుకున్నారు.
పాలనాదక్షుడు ‘వాసిరెడ్డి’
అమలాపురం రూరల్: ప్రజాక్షేమం కోరి, ధర్మాన్ని రక్షించిన పాలకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో వెంకటాద్రి నాయుడు చిరస్థాయిగా నిలిచారని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధర్మరక్షణే పరమావధిగా శిథిలావస్థకు చేరిన వందలాది దేవాలయాలను పునరుద్ధరించిన ఘనత రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడికే దక్కుతుందన్నారు. అమరావతి సంస్థానాధీశులైన వెంకటాద్రినాయుడు గొప్ప దాత, ప్రజారంజక పాలకుడన్నారు.


