చేతిచమురు వదలకుండా.. | - | Sakshi
Sakshi News home page

చేతిచమురు వదలకుండా..

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

చమురును చక్కబెట్టేస్తున్నారు.. కొరత పేరు చెప్పి కొరివి తెస్తున్నారు.. గంటల తరబడి క్యూలో ఉన్నవారిని కాదని గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.. జిల్లాలోని పెట్రోల్‌ బంకుల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ తంతును అడ్డుకునేవారు లేకపోతున్నారు.. వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌కు డీజిల్‌, పెట్రోల్‌

కొరతను సాకుగా చూపి ఎత్తుగడ

బంకుల వద్ద చమురు లేదని బోర్డులు

జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు

కాట్రేనికోన/ అమలాపురం రూరల్‌ / అల్లవరం: పెట్రోల్‌ బంకుల్లో ఎంతకంతకూ రద్దీ పెరుగుతోంది. కోనసీమలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. చివరికి చమురు లేదని బోర్డు పెట్టడం కనిపిస్తోంది. జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన 115 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఆదివారం చాలాచోట్ల బంకుల్లో నో స్టాక్‌ బోర్టులు పెట్టేశారు. మరికొన్ని చోట్ల భారీ క్యూ కనిపించింది. అక్కడ మాత్రం రూ.100, లేక రూ.200 చొప్పున పెట్రోల్‌ కొట్టడం కనిపించింది. ఇదిలా ఉంటే కొందరు బ్లాక్‌ మార్కెట్‌లో చమురును అమ్ముకుంటున్నట్లు సమాచారం. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం, అమలాపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఆక్వా, రైతులకు వ్యవసాయ, మత్స్యశాఖ అధికారుల సిఫార్సు లేఖలతో డీజిల్‌ అందించారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోనూ ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. పంట చేలు కోతకు రావడం, ఎండల తీవ్రత, విద్యుత్‌ కోతలతో ఆక్వా రైతులు సైతం జనరేటర్లు, ఇంజిన్లపై ఏరియేటర్లు తిప్పేందుకు డీజిల్‌పై ప్రధానంగా ఆధారపడటం, బంకులలో తగినంత డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్‌ కొరతను సాకుగా చూపిస్తూ, కొన్ని బంకుల్లో బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎక్కడెక్కడ ఎలా అంటే..

ఫ జిల్లాలో మూడో రోజు ఆదివారం డీజిల్‌ కష్టాలు మరింత పెరిగాయి. కొన్ని బంకుల వద్ద పోలీసుల సమక్షంలో అమ్మకాలు సాగించారు. డీజిల్‌ కోసం వినియోగదారులు, బంకు యాజమాన్యాల మధ్య వివాదాలు జరిగాయి.

ఫ కాట్రేనికోన మండలం దొంతికుర్రు పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు.

ఫ కొత్తపేట పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజిల్‌ కోసం వాహనదారులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రైతులు, వాహనాదారులు ఆందోళన చేశారు.

ఫ అమలాపురంలో పట్టణ, రూరల్‌ మండలంలోని 13 పెట్రోల్‌ బంకుల్లో కొన్నిచోట్ల నో స్టాక్‌ బోర్డులు కనిపించారు. ఈదరపల్లి, అమలాపురం నల్లవంతెన, ఎర్రవంతెన పెట్రోల్‌బ బంకు వద్ద క్యూ రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఫ ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి – నంగవరం రోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద డీజిల్‌ కోసం రైతులు బారులు తీరారు. వరి కోత మెషీన్లకు డీజిల్‌ కోసం క్యూలో ఉన్నా, స్టాక్‌ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫ బయట ఇళ్లు, షాపుల వద్ద 5 లీటర్ల డీజిల్‌ను గతంలో రూ.500 విక్రయించగా, ఇప్పుడు రూ.700కు అమ్ముతున్నారు. వీరికి బంకుల నుంచే చమురు వస్తున్నట్లు సమాచారం. కొన్ని బంకుల నుంచి నేరుగా లీటరుకు రూ.5 అదనంగా తీసుకుని మధ్యవర్తుల ద్వారా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు

చమురును బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాయి. జిల్లాలో రైతులు, వాహనదారులు చమురు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. డీజిల్‌, పెట్రోల్‌ కొరత లేదని జిల్లా కలెక్టర్‌ చెబుతున్నా, బయట అందుకు విరుద్ధంగా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీజిల్‌ కృత్తిమ కొరతను నివారించాలి. డీజిల్‌ కొరత, అనధికార విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగం కుదేలవుతుంది. మొన్నటి వరకూ యూరియా, నేడు డీజిల్‌ కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. చంద్రబాబు పాలనంటేనే పడిగాపులు తప్పవన్నట్లు ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలి.

–బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్సీ

ఇక్కడ పడిగాపులే..

కాట్రేనికోన మండలంలో ఎన్నడూ లేని విధంగా డీజిల్‌ కోసం రొయ్యలు, చేపల చెరువుల రైతులు, వాహనదారులు పడిగాపులు పడ్డారు. దొంతికుర్రు బంకు వద్ద డీజిల్‌ కోసం ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాట్రేనికోన పెట్రోలు బంకులో డీజిల్‌ నో స్టాక్‌ బోర్డు దర్శనమిచ్చింది. దొంతికుర్రు, కాట్రేనికోన పెట్రోల్‌ బంకులలో శనివారం రాత్రి 5 వేల లీటర్ల చొప్పున డీజిల్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకున్నారు. ఆదివారం 11 గంటలకు కాట్రేనికోనలో 1,750 లీటర్లు, దొంతికుర్రు బంకులో 6,140 లీటర్లు స్టాకు ఉన్నట్లు గుర్తించామని తహసీల్దార్‌ వి.రవికిరణ్‌ తెలిపారు. కొంత సేపటికే కాట్రేనికోన బంకులో డీజిల్‌ నో స్టాక్‌ బోర్డు పెట్టారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో డీజిల్‌ను సరఫరా చేస్తున్నామని తహసీల్దార్‌ రవికిరణ్‌ అన్నారు.

అల్లాడిపోతున్న ఆక్వా

వేసవి ఉష్ణోగ్రతలకు రొయ్యలు, చేపల చెరువుల్లో ఏరియేటర్లు పెట్టకుంటే ఆక్సిజన్‌ స్థాయి పడిపోయి ఒక్కసారిగా పంట మృత్యువాత పడే పరిస్థితి దాపురిస్తుంది. ఇలా ఆక్వా పరిశ్రమ అల్లాడిపోతుంది. విద్యుత్‌ కోతలు అధికంగా ఉండటంతో రైతులు డీజిల్‌ జనరేటర్లు, ఇంజిన్లపై ఆధారపడి ఏరియేటర్లను తిప్పుతూ పంటను రక్షించుకుంటున్నారు. బంకులలో డీజిల్‌ కొరతతో నో స్టాక్‌ బోర్డులు పెట్టడంతో ఆక్వా పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement