అమలాపురం రూరల్: జనగణన 2027కు సంబంధించి ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకూ డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న స్వీయగణనపై ప్రజలను చైతన్యపరిచేందుకు సోమవారం జనగణన 5కే రన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుంచి ఈ రన్ ప్రారంభించి, కలెక్టరేట్ వరకూ జరుగుతుందన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు, ఉద్యోగులు, యువత పాల్గొనాలని కోరారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవనంలో జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
డీజిల్ కొరతపై
ఆందోళన వద్దు
అమలాపురం రూరల్: డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజులలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో సరఫరా పునరుద్ధరణ కోసం చమురు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. పెట్రోల్ బంకుల్లో నిల్వల పర్యవేక్షణకు రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నంబర్ 9059 920242, 94933 13862కు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
బీచ్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
కాకినాడ రూరల్: సందర్శకులకు ఇబ్బందులు కలకుండా బీచ్‌లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సూర్యారావుపేట బీచ్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీచ్‌లో సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.
స్వీయ గణనలోభాగస్వాములు కావాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వీయ గణన(సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్, టూటౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ వరకూ ఆదివారం నిర్వహించిన 5కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 30 వరకూ జిల్లాలోని ప్రతి పౌరుడూ స్వీయ గణన నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటింటా జనగణ నమోదు కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకూ జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్నారని చెప్పారు.


